ప్రపంచ పర్యావరణ దినోత్సవ సంబరాలు
1 min readపల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును నిర్వహిస్తున్న ఎస్‌పీవీ అయిన ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నానక్‌రాం గూడ టోల్ ప్లాజా వద్ద ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్‌బీ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ వే లోని పలువురు సీనియర్ అధికారులు, ప్రాజెక్టు సిబ్బంది, హెచ్ఎండీఏ అధికారులు కూడా పాల్గొని ఆ ప్రదేశంలో మొక్కలు నాటారు. ప్రస్తుత పరిస్థితిలో పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం గురించి సిబ్బందికి, కార్మికులకు కంపెనీ అధికారులు ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు. వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి వీలైసన్ని ఎక్కువ మొక్కలు నాటాలని ఈ సందర్భంగా అధికారులు పిలుపునిచ్చారు. మరింత స్వచ్ఛమైన గాలి కావాలంటే మరిన్ని మొక్కలు నాటాలని చెప్పారు. తద్వారా భావితరాలకు మెరుగైన పర్యావరణాన్ని అందించగలమని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తామని, చెట్లు పెంచుతామని, ఇంధనాన్ని వృథా కానివ్వమని, మానవ నిర్మిత విధ్వంసాల నుంచి భూమాతకు రక్షణ కల్పిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థ, దేశంలో ప్రముఖ బహుళజాతి సమీకృత రవాణా మౌలిక సదుపాయాల డెవలపర్ అయిన ఐఆర్‌బీ… స్వచ్ఛ పర్యావరణానికి తనవంతు సేవలు అందించేదకు కట్టుబడి ఉంది. ఇందుకోసం సుస్థిర విధానాలను అవలంబిస్తూ, తమ సంస్థలోని కార్యకలాపాలు అన్నింటిలో వీటిని అమలుచేస్తోంది.