‘సీఎం బెయిల్ రద్దు ’ కల్పిత కథనంపై వైసీపీ ఫిర్యాదు
1 min readపల్లె వెలుగు వెబ్ : ముఖ్యమంత్రి జగన్ బెయిల్ ఈనెల 14న రద్దవుతుందని కల్పిత కథనాన్ని ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ సీఐడీ అదనపు డీజికి ఫిర్యాదు చేసింది. ‘ సీఎం బెయిల్ రద్దయ్యే రోజున తెదేపా ముఖ్యనేతలు, కార్యకర్తలు జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతపురం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులను కూడ నమ్మవద్దు. 1988 డిసెంబర్, 1991 మే నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఘటనలు దృష్ట్యా నీలి గూండాలను మరోసారి ఎదుర్కొనక తప్పదు. పోరాటం అంతిమ దశకు చేరింది.’ అంటూ ఒక కల్పిత కథనం రాశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఒక వర్గం వారిని రెచ్చగొట్టేలా, ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, న్యాయ విభాగం అధ్యక్షుడు మనోహర్ ఫిర్యాదు చేశారు.