ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం.. : కడప మేయర్ సురేష్‌బాబు
1 min readపల్లెవెలుగువెబ్, కడప: రాష్ట్రంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించిందని కడప మేయర్ సురేష్‌బాబు అన్నారు. సోమవారం కడపలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలు నిర్వహించే విధానం (ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా..) ఏదైనా రాష్ట్ర ప్రజలు వైసీపీకే పట్టం గడతారని పేర్కొన్నారు. కడప జిల్లాలో జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో గెలుపొందిన వైసీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99శాతం నెరవేర్చారని, నవరత్న పథకాలతో రాష్ట్రాన్ని సంపూర్ణ అభివృద్ధి, సంక్షేమబాటలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఈవీఎంలపై నమ్మకం లేదంటూ కుట్రలు పన్ని దుష్ప్రచారం చేసి బ్యాలెట్ విధానం కావాలన్న టీడీపీ కోరికతో జరిగిన ఎన్నికల్లో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం విశేషమన్నారు. టీడీపీకి ఓట్లు పడవనే భయంతో ఎన్నికలను కోర్టు ద్వారా అడ్డుకున్నారని, నిమ్మగడ్డ ద్వారా ఎన్నికలను ఆపివేయలని కుట్ర రాజకీయాలు చేసిన ఘనుడు చంద్రబాబని ఆరోపించారు. చివరకు ఎన్నికలు జరిగినా కౌంటింగ్ జరగకుండా కోర్టు ద్వారా నిలిపివేసినా…చివరకు వైసీపీదే న్యాయమన్న విషయం తేలిందన్నారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణిని ప్రజలు నమ్మే స్థితిలో లేదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో టిడిపిని మూసివేసే పరిస్థితి రావడం ఖాయమన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుంటున్నారని గుర్తు చేశారు. సమావేశంలో కార్పొరేటర్లు సూర్యనారాయణ, రామలక్ష్మణ రెడ్డి, షఫీ, వైస్సార్సీపీ బిసి విభాగ అధ్యక్షుడు బంగారు నాగయ్య, డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.