PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్కంఠగా మారిన నందికొట్కూరు వైసీపీ టికెట్…

1 min read

వైసీపీలో ఎటూ తెగని నందికొట్కూరు పంచాయతీ..!?

నందికొట్కూరు సీటు కోసం పోటీ పడుతున్న ఎమ్మెల్యే ఆర్థర్.. మాజీ ఎమ్మెల్యే లబ్బి.. డా.సుధీర్.. ఎక్కలదేవి సలోమీ..పి.శేషన్న.

లబ్బికి ఇవ్వాలని  అధిష్టానం వద్ద మొండిపట్టుపట్టిన బైరెడ్డి.

అనూహ్యంగా తెరపైకి ఎక్కలదేవి సలోమి..

పగిడ్యాల సర్పంచి పెరుమాళ్ళ శేషన్న పేరు..

ఎటూ తేల్చుకోలేకపోతున్న అధిష్టానం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నందికొట్కూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై ప్రతిష్టంభన నెలకొంది. నందికొట్కూరు  టికెట్ ఎవరికి అన్నది వైసీపీ విడుదల చేసిన మూడో జాబితాలో కూడా స్పష్టత రాలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే తొగురు ఆర్థర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి , వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఐజయ్య  తనయుడు ఎక్కలదేవి చంద్రమౌళి సతీమణి సలోమీ, కస్టమ్స్ ఆఫీసర్ వేల్పుల ఆనంద్ కుమార్ , కడప జిల్లాకు చెందిన ప్రముఖ వైద్యులు దార సుధీర్ లు నందికొట్కూరు టికెట్ ఆశిస్తున్నారు. వీరిరువురిలో ఎవరికి టికెట్ వస్తుందోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.అనూహ్యంగా పగిడ్యాల సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న పేరు తెరపైకి వచ్చింది. ఈయన పేరును మాజీ జడ్పీటిసి పుల్యాల నాగిరెడ్డి ప్రతిపాదించినట్లు సమాచారం. సొంత మండలం వ్యక్తి అయితే బాగుంటుందని సిద్దార్థ వద్ద చెప్పినట్లు తెలుస్తోంది.దీనికి సిద్దార్థ సానుకూలంగా స్పందించారని జోరుగా ప్రచారం సాగుతోంది .గతంలో  నందికొట్కూరు  టికెట్ ఆశించి ఎదో ఒకరకంగా సర్ధుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి  ప్రస్తుతం నందికొట్కూరు టికెట్ తనకు ఇవ్వాల్సిందేనని అధిష్టానం వద్ద పట్టుబట్టి కూర్చున్నారు. సామాజిక సమీకరణాలతో  సిద్దార్థ రెడ్డి కూడా లబ్బి వైపు మొగ్గు చూపారని అధిష్టానం వద్ద మొండి పట్టు పట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి .మరోపక్క సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ కూడా నందికొట్కూరు సీటు కోసం అంతేపట్టు బట్టి కూర్చున్నారు.అయితే తనకు అధికారాలు ఇవ్వాలని నియోజకవర్గంలో  ఇంచార్జి జోక్యం  లేకుండా  టికెట్ ఇస్తేనే  పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. కానీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఆర్థర్ ను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒప్పుకొనే పరిస్థితి కనిపించడం లేదు.  చంద్రమౌళి మాత్రం ఈ దఫా తనకు ఇవ్వకుంటే మహిళా కోట కింద  సతీమణి సలోమి కి  నందికొట్కూరు టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. 2014లో చంద్రమౌళి తండ్రి మాజీ ఎమ్మెల్యే ఐజయ్య వైసీపీ టికెట్ తో నందికొట్కూరు నుండి పోటీ చేసి విజయం సాధించారు. 2019లో నందికొట్కూరు టికెట్ కోసం ఐజయ్య , లబ్బి వెంకట స్వామి ప్రయత్నించినప్పటికీ వైసీపీ అధిష్టానం తొగురు ఆర్థర్ కు ఇచ్చింది. ఆర్థర్ 40వేల పైచిలుకు భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రభుత్వం చేపట్టిన గడపగడప కార్యక్రమంతో నియోజకవర్గ ప్రజలకు ఆర్థర్ చేరువయ్యారు. వైసీపీ అధిష్టానం నిర్వహించిన సర్వే ఫలితాలలో ఆర్థర్ దే అగ్రస్థానం. మళ్ళీ అర్థర్ కే టికెట్ వస్తుందని భావించిన ఆయన వర్గానికి అధిష్టానం మొండిచేయి ఇచ్చింది. సిద్దార్థ నాయకత్వం వ్యతిరేకిస్తున్న ఆర్థర్ కు టికెట్ ఇస్తే గెలుపు సాధ్యం కాదని భావించిన అధిష్టానం సిద్దార్థ తో చర్చలు జరిపారు. సిద్దార్థ రెడ్డి ఆర్థర్ కు టికెట్ వద్దు అని అధిష్టానం వద్ద తేల్చి చెప్పారు. కడప జిల్లా కు చెందిన డా.సుధీర్ పేరును అధిష్టానం సూచించడంతో స్థానికేతరులకు ఇస్తే గెలుపోటములపై ప్రభావం చూపిస్తుందని స్థానిక వ్యక్తికి టికెట్ ఇవ్వాలని సిద్దార్థ రెడ్డి అధిష్టానం వద్ద కోరినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే లబ్బి కి ఇస్తే బాగుంటుందని సూచించారు.అయితే పార్టీ కార్యక్రమాలకు ఆర్థికంగా సహాయం అందించిన చంద్రమౌళి తనకు ఇవ్వకుంటే సతీమణి సలోమి కి టికెట్ ఇవ్వాలని పట్టుబట్టారు. ఆయుష్మాన్ నర్సింగ్ కళాశాల , మదర్ తెరిసా నర్సింగ్ కాలేజ్ అధినేతగా సలోమి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితురాలు. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా కోటాకింద ఆమెకు అవకాశం ఇస్తే గెలుపు ఈజీగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.దీనికి తోడు మాజీ ఎమ్మెల్యే ఐజయ్య కుటుంబ వారసత్వం కలిసి వస్తుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో అనూహ్యంగా పగిడ్యాల సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న పేరు తెరపైకి రావడంతో నందికొట్కూరు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. నందికొట్కూరు వైసీపీ టికెట్ అధిష్టానం ఎవరికి ఇస్తుందో తెలియాల్సి ఉంది. అధిష్టానం ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి తర్వాత వైసీపీ  టికెట్ పంచాయతీ ఒక కొలిక్కి వస్తుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందరికి ఆమోదయోగ్యంగా వైసీపీ నాలుగో జాబితాలో వైసీపీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటిస్తుందని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో .

About Author