మెరుగైన జీవనానికి యోగా దోహదపడుతుంది
1 min read
యోగా ప్రాధాన్యతను తెలిపేందుకే యోగాంధ్ర
యోగ ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలి- జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి
నెలరోజులపాటు నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి శ్రీకారం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :యోగా మెరుగైన జీవనానికి దోహద పడుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.స్థానిక వట్లూరు టిటిడిసి లో బుధవారం ఏర్పాటుచేసిన జిల్లా స్థాయి యోగా ఓరియెంటేషన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యోగా ప్రాముఖ్యతపై ప్రజలలో అవగాహన పెంచేందుకు ‘యోగాంధ్ర’ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. జూన్, 21 యోగా దినోత్సవం పురస్కరించుకుని మే, 21 నుండి జూన్, 21 వతేదీ వరకు నెల రోజులపాటు యోగా మాసంగా పాటిస్తూ, యోగసాధనపై జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగాలో ప్రవేశంతో అవగాహన, శిక్షణ కల్పించబడుతుందన్నారు. యోగా పై శిక్షకులు అందిస్తున్న శిక్షణను అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరి నిత్యా జీవితంలో యోగా ఒక భాగం కావాలని, తద్వారా ఆరోగ్యకరమైన మంచి జీవన విధానం అలవడుతుందన్నారు. యోగా వలన ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కలుగుతుందన్నారు. మన భారతీయ సంస్కృతిలో యోగా ఒక భాగమని, ప్రతీ ఒక్కరూ యోగా ను అభ్యసించవలసిన అవసరం ఉందన్నారు. జూన్, 21న జరిగే ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమానికి భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన రాష్ట్రానికి రావడం ఆనందదాయకమన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో మాస్టర్ ట్రైనర్ల ద్వారా యోగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ‘యోగాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా వచ్చే వారం మండల స్థాయిలో తదుపరి వారం గ్రామ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. యోగా ప్రాముఖ్యతను విస్తృతం చేసేందుకు వివిధ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహణలో భాగంగా రూపొందించిన యాప్ ను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ యాప్ లో అందరూ నమోదై ఉపయోగించుకోవాలని సూచించారు. వేముల ధర్మారావు ఆధ్వర్యంలో యోగా శిక్షణా కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో డిఆర్ఓ వి. విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్, ఆయుష్ ఆర్ డిడి లక్ష్మి సుభద్ర, డిఆర్డిఏ పీడీ ఆర్. విజయరాజు,జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎల్డిఎం డి. నీలాద్రి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ త్రినాధబాబు, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి ఎం. ఎస్. కృపావరం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. మాలిని, పౌర సరఫరా సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి, డిపిఓ కె.అనురాధ, డిసిఓ ఏ . శ్రీనివాస్,తహసీల్దార్ శేషగిరిరావు, ఐసిడిఎస్ పీడీ శారద, బిసి సంక్షేమ శాఖాధికారి నాగరాణి, డిఎస్డిఓ శ్రీనివాస్, డిసిపి ఓ సూర్యచక్రవేణి లతో పాటు యోగా శిక్షకులు జి. విజయలక్ష్మి, సిహెచ్. శివ, కె. వినోద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
