మానవ దైనందిన జీవితంలో యోగ నిరంతర ప్రక్రియ కావాలి
1 min read
డోన్ ఆర్డిఓ నరసింహులు
కొలిమిగుండ్ల/ నంద్యాల, న్యూస్ నేడు : ప్రతి మనిషి జీవితంలో యోగ నిరంతర ప్రక్రియ కావాలని డోన్ రెవెన్యూ డివిజన్ అధికారి నర్సింహులు పేర్కొన్నారు. శుక్రవారం కొలిమిగుండ్ల మండలంలోని బెలూం గుహల ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా దాదాపు 1850 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిఎంహెచ్ఓ డా. వెంకటరమణ, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణ, ఆయుష్ సీనియర్ మెడికల్ అధికారి యశోదరతో పాటు పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డోన్ ఆర్డిఓ నరసింహులు మాట్లాడుతూ ప్రతి మానవుని దైనందిన జీవితంలో యోగా ప్రక్రియ నిరంతర సాధన కావాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని పుణ్యక్షేత్రాలలో నిర్వహించి భక్తులను, యాత్రికులను మమేకం చేసి యోగా కార్యక్రమంలో ఆరోగ్యాన్ని అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలన్న ప్రధానోద్దేశంతోనే జిల్లాలోని శ్రీశైలం, మహానంది తదితర పర్యాటక ప్రాంతాలలో యోగ విన్యాసాలు నిర్వహించుకోవడం జరిగిందన్నారు ఈ క్రమంలోనే భాగంగా బెలూం గుహల ఆవరణలో దాదాపు 1850 మందితో యోగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద, దేశంలో పొడవైన గుహలుగా ప్రసిద్ధి చెందిన బెలూం గుహల ఆవరణలో యోగాసనాలు వేయడం ఆనందకరంగా ఉందన్నారు. బెలూం గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాచే గుర్తింపు దక్కడం విశేషమని ఆర్డిఓ పేర్కొన్నారు. జిల్లాలో దాదాపు 8 లక్షల మంది యోగాంధ్ర అప్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆర్డీవో కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వెంకటరమణ మాట్లాడుతూ ఆహ్లాదకర వాతావరణంలో యోగాసనాలు వేయడం ఆనందకరంగా ఉందన్నారు. ఇలాంటి యోగా కార్యక్రమాలు ప్రతి వ్యక్తి నిత్యం ఆచరించి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని డిఎంహెచ్ఓ ఈ సందర్భంగా కోరారు. జిల్లా ఆయుష్ శాఖ యోగ ట్రైనర్లు ప్రోటోకాల్ ప్రకారం యోగాంధ్ర కార్యక్రమంలో వృక్షాసనము, వక్రాసనము, సేతు బందాసనం, తాడాసనం, ఉత్తాన పాదాసనము, పవనముక్తాసనము, అర్థ చక్రాసనం, శలభాసనము, ఉష్టాసనం, పాదహస్తానము, దండాసనము మొదలైన ఆసనాలను వేయించారు. అలాగే కపాలభాతి, అనులోమ విలోమ, శీతలి, భ్రామరి మొదలైన విధానాలతో ప్రాణాయామం చేయించారు.
