యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త..
1 min readజిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగు సమాజాన్ని చైతన్య పరిచిన యోగి వేమన గొప్ప సంఘ సంస్కర్త, దార్శనికులని ఆయన చెప్పిన సన్మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన తెలిపారు.శుక్రవారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో యోగివేమన జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన యోగివేమన చిత్రపటానికి పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు .ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా తేలికైన పదజాలంతో రచించిన వేమన పద్యాలు అన్ని తరాల ప్రజలు అంగీకరించడం ఆయన రచనల యొక్క గొప్పతనం అని కలెక్టర్ పేర్కొన్నారు. యోగివేమన ప్రజాకవి అని, పామరులు , పండితులను అలరించిన ఆయన కవిత్వం ఎంతో గొప్పదన్నారు. వేమన విగ్రహారాధనకు, కులాలకు, మతాలకు అతీతమని అయన అన్ని వర్గాలకు చెందిన వ్యక్తి అని అన్నారు. సమాజంలో ఉన్న దురాచారాలపై ఆనాడే తన పద్యాలతో ధైర్యంగా ఎదిరించాడని, కొన్ని మానవత్వంతో కూడిన రచనలు ఉన్నాయని అటువంటి గొప్ప కవి గురించి ఈరోజు స్మరించుకోవడం శుభ పరిణామం అని అన్నారు. ఆయన పద్యాలతో జీవిత సత్యాలను ప్రజలకు తెలియజేశారని, తెలుగు భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని తెలిపారు. అన్ని రకాల సమాజ పరిస్థితులకు అద్దం పట్టేలా వేమన పద్య రచనలు సాగాయని, ఇలాంటి కవి ఉండటం తెలుగు ప్రజలకు గౌరవప్రదమని తెలిపారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోడానికి వేమన పద్యాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.కార్యక్రమంలో సిపిఓ హిమప్రభాకర్ రాజు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.