ఇష్టంతో చదివినప్పుడే మంచి ఉత్తీర్ణత సాధిస్తారు
1 min read– అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ వేణుగోపాల్.
– పదవ తరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి.
– పదవ తరగతిలో వెనకబడ్డ విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు నిర్వహించాలి..
పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: విద్యార్థులు కష్టపడి కాక ఇష్టంతో చదివినప్పుడే విద్యలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారని అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్, సమగ్ర శిక్ష అభియాన్ ప్లానింగ్ ఆఫీసర్ మారుతి లు పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రమైన గోనెగండ్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం మండల విద్యాధికారి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ తల్లిదండ్రులు, పిల్లలను, మంచి మంచి ఉద్యోగాలు సాధించి మంచి హోదాలలో చూడాలని బడులకు (పాఠశాల) పంపుతున్నారన్నారు. అయితే విద్యార్థులు కూడా తల్లిదండ్రుల ఆశయాలను నిర్లక్ష్యం చేయకుండా, కష్టపడి చదివినప్పుడు ఎంతటి శిఖరాలనైనా అవలీలగా అధిరోహించవచ్చన్నారు. పట్టుదల తో చదివితే సాధించలేనిది ఏది లేదు అని, కష్టపడి చదివి, మంచి మార్కులతో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. విద్య లేనివాడు వింత పశువు అన్న చందంగా…ఎన్ని ఉన్నా విద్య లేకుంటే అన్ని సున్నా అన్నారు. ధనం కన్నా, విద్యాధనం గొప్పదన్నారు. విద్య ఉన్నవారు ఎక్కడికెళ్లినా. తెలివితేటలతో, విద్యతో, బ్రతకగలరన్నారు. పదవ తరగతిలో కష్టపడి ఇష్టంతో చదివి పదవ తరగతిలో వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని, చదువు పట్ల నిర్లక్ష్యం విడి, పట్టుదలతో చదవాలని,కృషితో సాధించలేనిది ఏమీ లేదన్నారు. ఇప్పటి నుండి అయినా కష్టపడి చదివి, చదివిన పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులకు సులభమైన పద్ధతిలో బోధించాలని , వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగభూషణం, ఉపాధ్యాయులు ,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.