పెళ్లి వద్దంటోన్న యువత !
1 min readపల్లెవెలుగువెబ్ : చదువుకున్న పిల్లలకు ఏదో ఒక ఉపాధి, ఉద్యోగం దొరుకుతున్నది. సంపాదనలో పడుతున్నారు. అయినా సరే పెళ్లి మాట మాత్రం ఎత్తడం లేదు. అసలు చేసుకుంటారో లేదో చెప్పడం లేదు. దాంతో తల్లిదండ్రులు అయోమయంలో ఉంటున్నారు. తీవ్ర ఆందోళన కూడా చెందుతున్నారు. జాతీయ గణాంకాల సంస్థ తాజా అధ్యయనం ప్రకారం నేటి యువతలో (15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వరకు) పెళ్లి మాట ఎత్తనివారి సంఖ్య 2019 నాటికి 23 శాతం ఉంది. 2011లో వీరి శాతం 17 మాత్రమే. బాల్య వివాహాలు తగ్గడం ఈ అధ్యయనంలో కనిపించినా తరుణ వయసు వచ్చాక కూడా పెళ్లి మాట ఎత్తకపోవడం పట్టించుకోవలసిన విషయంగా అర్థమవుతోంది. అబ్బాయిల్లో 2011లో నూటికి 20 మంది పెళ్లి మాట ఎత్తకపోతే 2019లో 26 మంది పెళ్లి ప్రస్తావన తేవడం లేదు. అమ్మాయిల్లో 2011లో నూటికి 11 మంది పెళ్లి చేసుకోకపోతే 2019లో నూటికి 20 మంది పెళ్లి పట్ల నిరాసక్తిగా ఉన్నారు. సగటున చూస్తే అబ్బాయిలు అమ్మాయిలు కలిపి నూటికి 23 మంది 29 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.