వైఎస్ జగన్ బూటకపు వాగ్ధానాలను భోగి మంటల్లో
1 min readతగలబెట్టిన చింతమనేని ప్రభాకర్..
రానున్నది టిడిపి జనసేన ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం – రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన..దుగ్గిరాలలోని చింతమనేని స్వగ్రామంలో ఘనంగా భోగి వేడుకలు..
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : భోగ భాగ్యాలను ఇచ్చే భోగి పండుగ, సకల సిరులను అందించే సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి జీవితాల్లో సుఖ సంతోషాలను కాంక్షిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు.చింతమనేని స్వగ్రామం దుగ్గిరాలలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భోగి వేడుకల్లో గ్రామస్థులతో కలిసి చింతమనేని పాల్గొన్నారు.ఈ సందర్భంగా దుగ్గిరాల ప్రజలకు, దేశ విదేశాల నుంచి తమ సొంత గ్రామానికి చేరుకున్న గ్రామస్థుల కుటుంబ సభ్యులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన చింతమనేని భోగి వేడుకలను ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, “పదవీ కాంక్షతో బూటకపు వాగ్ధానాలు చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి వల్ల రాష్ట్రం సర్వ నాశనం అయిందని, కోట్లాది మంది ప్రజలు ఎన్నో అవస్థలు పడుతూ జీవిస్తున్నారని చింతమనేని అన్నారు. సర్వశిక్ష అభియాన్ సహా ఎంతో మంది సిబ్బందిని రెగ్యులరైజ్ చేస్తామన్న హామీని నేడు గాలికి వదిలేశారు అని, ఆఖరికి పిల్లలకు పౌష్టిక ఆహారం ఇచ్చే అంగన్వాడీ సిబ్బంది సైతం నెలరోజులుగా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్ల మీదకెక్కి సమ్మె చేస్తుంటే కనీస జాలి లేకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా జగన్మోహన్ రెడ్డి వారిపై ఎస్మా ప్రయోగించటం సిగ్గు చేటని చింతమనేని అన్నారు. రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ స్కూళ్లను జగన్ సర్కార్ కుదిస్తున్నారని, 4టైల్స్ ముక్కలు అంటించి వాటినే స్కూళ్లలో నాడు – నేడు అంటున్నారని, పేదవాడికి సరైన వైద్యం అందే పరిస్థితి ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేడు లేదని అన్నారు. ఎన్నికల నాడు అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ఎన్నో హామీలు ఇచ్చిన జగన్ కు, ప్రజలు నమ్మి అధికారం అప్పచెబితే 85% హామీలు అమలు చేయకుండా కాలయాపన చేసి జనాన్ని మోసం చేశాడని ,అందువల్లనే వైఎస్ జగన్ బూటకపు హామీల ప్రతులను భోగి మంటల్లో వేసి తగులబెట్టడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రతులు లాగానే అడ్రస్ లేకుండా గాలిలో కలిసి పోయాయని చింతమనేని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వ విధానం మొత్తం “ప్రజల డబ్బు దోచుకోవడం – దోచుకున్నది దాచుకోవటమే” అని అన్నారు.టిడిపి జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అండగా నిలిచేలా అసలైన అభివృద్ధి సంక్షేమ పాలనను అందిస్తామని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు స్త్రీ నిధి గా నెలకు రూ1500/- ఇస్తామని, బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామని, “తల్లికి వందనం” ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు చదువుతూ ఉంటే వారికి ప్రతి ఒక్కరికి ఏడాదికి రూ.15,000/- అందిస్తామని, మహిళలకు ఏడాదికి 3గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తామని, రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.20000/- లు, యువతకు భవిష్యత్తు గ్యారంటీ ఇస్తామని, 20లక్షల ఉద్యోగాలతో యువతకు ఉపాధి కల్పిస్తామని, ఉద్యోగం వచ్చేలోగా వారికి నెలకు రూ.3000/- యువగళం ద్వారా అందిస్తామని, బీసీలకు రక్షణ చట్టాన్ని తెస్తామని, రాష్ట్రంలో పూర్తిగా అణగారి పోయిన శాంతి భద్రతలను తిరిగి కట్టుదిట్టంగా అమలు చేసి రాష్ట్రంలో ప్రశాంతమైన, భద్రతతో కూడిన జీవనాన్ని ప్రజలకు అందిస్తామని చింతమనేని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా ఆమోదయోగ్యంగా ఉండేలా టిడిపి జనసేన అధ్యక్షులు అయిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల ఆధ్వర్యంలో ఉమ్మడి మ్యానిఫెస్టోని కూడా ప్రజలకు అందిస్తామని అన్నారు. దెందులూరు గ్రామగ్రామాన టిడిపి జనసేన కూటమికి ప్రజలనుంచి అశేష ఆదరణ లభిస్తుందని, వచ్చే ఎన్నికల్లో దెందులూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో టిడిపి జనసేన కూటమి ఘన విజయం సాధించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని చింతమనేని ప్రభాకర్ అన్నారు..”ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ జనసేన నాయకులు, ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అబ్బినేని విజయ్ కుమార్, TNSF నాయకులు మహేష్ యాదవ్, దుగ్గిరాల గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.