వైఎస్ వివేకా హత్య కేసు.. కీలక సాక్షి అనుమానాస్పద మృతి !
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అలియాస్ కువైట్ గంగాధర్ రెడ్డి అనుమానాస్పద రీతిలో మరణించారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. నిద్రపోయిన సమయంలో గంగాధర్ రెడ్డి మరణించినట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. కల్లూరు గంగాధర్ రెడ్డి స్వస్థలం పులివెందుల. పదేళ్ల క్రితం అనంతపురం జిల్లా యాడికిలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న శివశంకర్ రెడ్డికి ప్రధాని అనుచరుడుగా గంగాధర్ రెడ్డి వ్యవహరించారు. గతేడాది అక్టోబర్ 2న వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసు తనపై వేసుకుంటే పది కోట్లు ఇస్తానని శివశంకర్ రెడ్డి చెప్పినట్టు గంగాధర్ రెడ్డి సీబీఐకి తెలిపిన విషయం తెలిసిందే.