అర్హులైన పేదింటి ఆడబిడ్డలకు అండగా వైఎస్సార్ కళ్యాణమస్తు
1 min readజిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా 446 జంటలకు రూ.3.72 కోట్లు లబ్ది
జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా జిల్లాలో 446 జంటలకు రూ.3.72 కోట్ల రూపాయలు లబ్ది చేకూరినట్లు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పేర్కొన్నారు.గురువారం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాన్ని కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి తదితరులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జూలై నుండి సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలలో ఉన్న ఆడపిల్లలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా వారికి ఆర్థిక చేయూత అందిస్తూ అర్హులైన పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ పథకం యొక్క లబ్ధి పొందాలంటే పెళ్ళి నాటికి అమ్మాయి వయసు 18 సం.లు, అబ్బాయి వయసు 21సం.లు ఉండాలన్నారు. ఈ పథకాల వల్ల బాల్య వివాహాలు తగ్గడంతో పాటు ఆడపిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించే అవకాశం ఉంటుందన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు/వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఎస్సీ, ఎస్టీలకు లక్ష రూపాయలు , కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు లక్షా 20 వేల రూపాయలు, బీసీలకు 50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు 75 వేలు, మైనారిటీ లకు లక్ష రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు లక్షా 50 వేల రూపాయలు, భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు 40వేలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంగా అందజేయడం జరుగుతుందన్నారు. కర్నూలు జిల్లాలో వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా జూలై నుండి సెప్టెంబర్ 2023 త్రైమాసికంలో నూతనంగా వివాహం చేసుకున్న మొత్తం 446 మంది లబ్ధిదారులు (బీసిలు – 167 (ఒక్కటే కులం – 159, కులాంతర వివాహం – 8) , విభిన్న ప్రతిభావంతులు – 4, మైనారిటీస్ – 83(ఒక్కటే కులం – 81, కులాంతర వివాహం – 2), ఎస్సీ – 184 (ఒక్కటే కులం – 183, కులాంతర వివాహం – 1), ఎస్టీ – 8 మంది లబ్ధి పొందారన్నారు.యకర్నూలు ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదింటి ఆడబిడ్డల నూతన వధూవరులకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా ద్వారా ఆర్థిక చేయూత అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన నగదును సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.కర్నూలు నగర మేయర్ మాట్లాడుతూ వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఇప్పటికే మూడు విడతల కింద నగదును లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నాల్గోవ విడత కింద కార్యక్రమాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాలో నగదు జమచేశారని పేర్కొన్నారు.. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క లబ్ధి పొందాలంటే పెళ్ళి నాటికి అమ్మాయి వయసు 18 సం.లు, అబ్బాయి వయసు 21సం.లు ఉండడంతో పాటు 10 వ తరగతి ఉత్తీర్ణత సాధించిన సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలని అర్హతలు పెట్టడం వల్ల బాల్య వివాహాలు తగ్గడంతో పాటు ఆడపిల్లల చదువుకోవడానికి అవకాశం ఉంటుందని భావించిన గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారన్నారు.కోడుమూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఉన్న పిల్లలను చదివించడమే కాకుండా, పిల్లల వివాహాన్ని గౌరవప్రదంగా నిర్వహించేందుకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు… ఆడ పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తల్లి తండ్రులు పిల్లలను ప్రోత్సహించి బాగా చదివించాలని సూచించారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల వివాహ సమయంలో సామాజిక బాధ్యతతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అండగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకం ద్వారా 446 మంది లబ్ధి పొందిన వారికి మొత్తం రూ.3.72 కోట్ల రూపాయల మెగా చెక్కును కర్నూలు ఎంపి డాక్టర్ సంజీవ్ కుమార్, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై.రామయ్య, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డిసిఎంఎస్ చైర్మన్ శిరోమణి తదితరులు లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో డిఆర్డిఎ పిడి సలీమ్ బాషా, సాంఘిక సంక్షేమ అధికారి రంగలక్ష్మి దేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీనివాస్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.