NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నైపుణ్య యువతగా తీర్చిదిద్దుతాం…

1 min read

రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి

వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి

టీడీపీ కేంద్ర కార్యాయంలో జెన్-జీతో మంత్రి లోకేష్ ఆత్మీయ భేటీ

మంగళగిరి, న్యూస్​ నేడు : యువత అంకితభావం, సమష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలని టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహానాడు సందర్భంగా జెన్-జీతో నారా లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యువత అభిప్రాయాలు తెలుసుకున్నారు. జెన్ జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి:  రాష్ట్రానికి ఏఐ, క్వాంటం టెక్నాలజీలు వస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కరిక్యులమ్ లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్యలో ఇప్పటికే పెద్దఎత్తున సంస్కరణలు తీసుకువచ్చాం. పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కోసం ప్రజాప్రభుత్వం క్లస్టర్ బేస్డ్ విధానంతో ముందుకు వెళ్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 22 పారిశ్రామిక క్లస్టర్లను గుర్తించాం. డేటా, ఐటీ, క్వాంటం, రాయలసీమలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యూవబుల్ ఎనర్జీ వంటి క్లస్టర్లు ఏర్పాటుచేస్తున్నాం. ఒకేచోట ప్రధాన పరిశ్రమలతో పాటు అవసరమైన అనుబంధ పరిశ్రమలు, విడిభాగాల తయారీ యూనిట్లను నెలకొల్పడం ద్వారా ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కోసం స్కిల్ డెవలప్ మెంట్ పై ప్రత్యేక దృష్టిసారించాం. రాష్ట్రానికి ఇప్పటివరకు రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్ వంటి సంస్థలు పెద్దఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. వచ్చిన అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి. యువతను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దుతాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం అని స్పష్టం చేశారు.

యువత అంకితభావం, సమిష్టి కృషి, త్యాగం అలవర్చుకోవాలి

యువత తమకు నచ్చిన రంగంలో విజయం సాధించాలంటే కలిసికట్టుగా పనిచేయాలి. నేను టీమ్ వర్క్ ను విశ్వసిస్తా. కొన్ని త్యాగాలు కూడా చేయాలి. నేను బాబు తో పోటీపడాలంటే బాబు  కంటే ఎక్కువ కష్టపడాలి. ఈ రోజు నేను సక్సెస్ అయ్యానంటే కోటిమంది కార్యకర్తలు కారణం. అనుకున్నది సాధించేవరకు విడిచిపెట్టకూడదు. నా పాషన్ ప్రజలకు సేవ చేయడం, ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెం.1 చేయడం. పాషన్ అనేది చాలా అవసరం. తర్వాత టీమ్ వర్క్, త్యాగం. కుటుంబ సభ్యులతో నేను ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. నా లక్ష్యం ఒక్కటే బాబు తో, మోదీ తో పోటీపడాలి. విజయానికి దగ్గరి దారులు లేవు. కష్టపడటం ఒక్కటే మార్గం. ఇతర నగరాల గురించి ఎంతకాలం మాట్లాడుకుంటాం. అమరావతి, విశాఖ, రాయలసీమ గురించి కూడా మాట్లాడుకోవాలి.

యువత రాజకీయాల్లోకి రావాలి: యువత రాజకీయాల్లోకి రావాలి. తెలుగుదేశం పార్టీ యువతకు అనేక అవకాశాలు కల్పిస్తోంది. గ్రామ పార్టీ అధ్యక్షుడు పొలిట్ బ్యూరో సభ్యుడు కావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. యువత పోరాటం అలవర్చుకోవాలి. పాదయాత్రలో నేను ప్రతిరోజూ పోరాడాను. నా స్టూల్ లాక్కున్నారు. మైక్ లాక్కున్నారు. ప్రతిరోజూ పోరాటమే. జీవితం ఎప్పుడూ స్ట్రైట్ లైన్ లా ఉండదు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయాను. 2024 ఎన్నికల్లో 91వేల మెజార్టీతో విజయం సాధించాను. ఆ రోజు భయపడి ఉంటే.. ఇది సాధ్యమయ్యేది కాదు.

మహిళలకు మద్దతుగా నిలవాలి: మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళా సాధికారత ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి. మా ఇంట్లో మా అమ్మ, బ్రాహ్మణి ఈ విషయంలో స్ఫూర్తిగా నిలిచారు.ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్న గుంటూరుకు చెందిన వేమూరి సాత్విక్, విజయవాడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసిన చరణ్ యాదవ్, కేఎల్ యూలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన విజయవాడకు చెందిన సత్యసాయి పవన్ కుమార్, అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఇంటిగ్రేడెట్ బయోలజీలో మూడో ఏడాది విద్యనభ్యసిస్తున్న ఖ్యాతి వర్థిని పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *