వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక పూజలు
1 min read

చిప్పగిరిలో 101 బిందెలతో అభిషేకం చేసిన ఎమ్మెల్యే వీరాభిమాని విజయ్ కుమార్ – ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం చిప్పగిరి గ్రామంలో వెలసిన శ్రీ భం భం బాబా సాయిబ్ స్వామి సన్నిధిలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వీరాభిమాని విజయ్ కుమార్ స్వామివారిపై 101 బిందెలతో పవిత్ర జలాభిషేకం నిర్వహించి తన భక్తిని చాటుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు.అనంతరం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి శ్రీ భం భం బాబా సాయిబ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఎమ్మెల్యేకు ప్రత్యేక ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారి అనుగ్రహంతో రాష్ట్రంలో, ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులకు మంచి పంటలు పండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భక్తి, సేవా భావంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు రైతాంగ శ్రేయస్సు కోసం చేసిన ప్రార్థనగా నిలిచిందన్నారు. వర్షాభావ పరిస్థితులు తొలగి చెరువులు, కుంటలు నిండిపోవాలని, ప్రతి రైతు కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని వారు కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



