NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు పంట బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే భరించాలి – సీఐటీయూ డిమాండ్

1 min read

పంట బీమా నమోదు గడువును వెంటనే పొడిగించాలని విజ్ఞప్తి

తహసీల్దార్ లక్ష్మీరాజ్‌కు సీఐటీయూ మండల కార్యదర్శి సి. నాగరాజు వినతిపత్రం

అనావృష్టితో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఉచిత పంట బీమా కల్పించాలని డిమాండ్

హోళగుంద న్యూస్ నేడు: ఎల్‌నినో ప్రభావం, కేంద్ర–రాష్ట్ర స్థాయిలో నెలకొన్న అనావృష్టి పరిస్థితుల కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న రైతులను ఆదుకునేందుకు పంట బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించాలని సీఐటీయూ మండల కార్యదర్శి సి. నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు హొళగుంద తహసీల్దార్ లక్ష్మీరాజ్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సి. నాగరాజు మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని తెలిపారు. ఇప్పటికే సాగు ఖర్చులు, విత్తనాలు, ఎరువులు, కూలీల వ్యయాలతో రైతులు అప్పుల పాలవుతున్నారని, ఇలాంటి సమయంలో పంట బీమా ప్రీమియం పేరుతో మరో ఆర్థిక భారం మోపడం సరికాదన్నారు.రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా ఉచిత పంట బీమా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా వేరుశెనగ, పత్తి తదితర పంటలకు రైతులు సుమారు రూ.2,000 వరకు ప్రీమియం చెల్లించాల్సి వస్తోందని, ఇది చిన్న, సన్నకారు రైతులకు భారంగా మారిందన్నారు.అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన రైతులపై డ్రాప్ ఇన్సూరెన్స్ పేరుతో విధిస్తున్న బీమా భారం కూడా ప్రభుత్వమే భరించాలని కోరారు. రుణగ్రహీత రైతులు అదనపు బీమా చెల్లింపులతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ, పంట నష్టం సంభవించినప్పుడు వారికి సరైన నష్టపరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో ప్రభుత్వమే పంట బీమా ప్రీమియాన్ని భరించేదని గుర్తు చేసిన నాగరాజు, ప్రస్తుతం కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునే దిశగా మళ్లీ అదే విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉచిత పంట బీమా అత్యవసరమని పేర్కొన్నారు.పంట బీమా నమోదు గడువు ముగింపు దశకు చేరుకున్న నేపథ్యంలో, ఇంకా అనేక మంది రైతులు నమోదు చేసుకోలేకపోయారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లోపం, సాంకేతిక సమస్యలు, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున ప్రభుత్వం వెంటనే పంట బీమా నమోదు గడువును మరోసారి పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పంట బీమా ప్రీమియాన్ని పూర్తిగా భరించడంతో పాటు గడువును కూడా పొడిగించి రైతులకు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో మణికంఠ, దుర్గప్ప తదితరులు పాల్గొని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *