(విఎస్ఎస్) అభివృద్ధికి అటవి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి
1 min read

సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య
జిల్లా అటవి శాఖ అధికారికి విజ్ఞప్తి
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో చింతలపూడి మండలంలో ఉన్న వన సంరక్షణ సమితుల (వి ఎస్ ఎస్) అభివృద్ధికి అటవి శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, బి కే యం యు ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కంచర్ల గురవయ్య బండి వెంకటేశ్వరరావు ఏలూరు జిల్లా అటవి శాఖ అధికారికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఏలూరు డి.ఎఫ్.ఓ ని సిపిఐ బికేఎంయు నాయకులు కలిసి విఎస్ఎస్ ల సమస్యలను, వి ఎస్ ఎస్ లలో సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. చింతలపూడి మండలం పాత చింతలపూడిలో విఎస్ఎస్ అభివృద్ధికి నేరేడు సీతాఫల మొక్కలతోపాటు ఎదురు పెంపకానికి అవకాశం కల్పించాలని వారు డి ఎఫ్ ఓ ని కోరారు. కొమ్ముగూడెం వి ఎస్ ఎస్ లో మరి కొంతమంది కొత్త సభ్యులను చేర్పించుకొని విఎస్ఎస్ అన్ని అభివృద్ధి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కమలాపురం వి ఎస్ ఎస్ కు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పేదలను ఆ వి ఎస్ ఎస్ లో కలిపి వి ఎస్ ఎస్ కు మరికొంత అడవి బంజరును కేటాయించి పేద ప్రజలను ఆదుకోవాలని వారు డిఎఫ్ఓ ను కోరారు. రేచర్ల వి ఎస్ ఎస్ కు సంబంధించి జామాయిల్ కటింగ్ అయ్యి సంవత్సరం అయిన ఇంతవరకు విఎస్ఎస్ సభ్యులకు కట్టింగ్ అయిన జామ్ ఆయిల్ డబ్బులు పడలేదని, వాటిని చెల్లించేందుకు డి ఎఫ్ ఓ తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలో అనేక వి ఎస్ ఎస్ లు అభివృద్ధికి నోసుకోక, పూర్తిస్థాయి సభ్యులు లేక, వి ఎస్ ఎస్ కమిటీలు సక్రమంగా పనిచేయక, అటవీ శాఖ నుండి విఎస్ఎస్ ల కు సరైన ప్రోత్సాహం లేక కుంటుపడ్డాయని వారు డిఎఫ్ఓకి తెలిపారు. డీఎఫ్ఓ మాట్లాడుతూ ఆగస్టు చివరకల్లా కటింగ్ అయిన విఎస్ఎస్ ల తాలూకు డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటానని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ప్రకారం కొత్త వి ఎస్ ఎస్ లు ఏర్పాటుకు, ఉన్న విఎస్ఎస్ ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. డి ఎఫ్ ఓ ని కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చింతలపూడి మండలం కార్యదర్శి ఇస్తరాకుల వెంకటేశ్వరరావు, బొక్క లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.


