ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్పరి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
1 min read
సభా స్థలం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి – అధికారులకు కీలక సూచనలు
ఆలూరు న్యూస్ నేడు: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 25న ఆస్పరి మండలంలో నిర్వహించనున్న పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ వైకుంఠం జ్యోతి, జిల్లా కలెక్టర్ సిరి, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, డీఎస్పీ వెంకట్రామ్మయ్య, జాయింట్ కలెక్టర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులతో కలిసి సభా స్థలాన్ని విస్తృతంగా పరిశీలించారు.పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా సభా వేదిక, వాహనాల పార్కింగ్, తాగునీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాట్లు, పారిశుద్ధ్యం, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల రాకపోకలు, మీడియా ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా పరిశీలించారు. ప్రతి విభాగం సమన్వయంతో పని చేసి పర్యటనను విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.అనంతరం ఆస్పరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన బృందం అక్కడ అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, పరిశుభ్రత, మౌలిక వసతులను పరిశీలించింది. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన ఆస్పరి మండల అభివృద్ధికి కొత్త దిశానిర్దేశం చేయనున్నదని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేలా ఈ పర్యటన ఉండబోతుందని పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఏర్పాటును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



