“రైతుల ద్రోహి చంద్రబాబు.. రైతుల కష్టాలు పట్టని కూటమి ప్రభుత్వం
1 min read
” – ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్ర విమర్శలు
రైతులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
వైఎస్సార్‌సీపీ హయాంలో ఒక రూపాయి ప్రీమియంతోనే పంటల బీమా అమలు
పంట నష్టం జరిగినా పరిహారం అందక రైతులు తీవ్ర ఇబ్బందులు
రైతుల హక్కుల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది
ఆలూరు న్యూస్ నేడు: రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోందని, రైతుల ప్రభుత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం రైతులను పూర్తిగా నిరాశపరిచిందని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం కర్నూలు ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని మండిపడ్డారు.చంద్రబాబు నాయుడు రైతు పక్షపాతినని చెప్పుకుంటున్నప్పటికీ, రైతులకు ఉపయోగపడే ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదని ఆయన ఆరోపించారు. అతివృష్టి వచ్చినా, అనావృష్టి వచ్చినా రైతుల కష్టాలు పెరుగుతున్నాయే తప్ప ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా కనిపించడం లేదన్నారు. రైతు సంక్షేమంపై మాటలు తప్ప చేతల్లో మాత్రం ఏమీ కనిపించడం లేదని విమర్శించారు.గత ఏడాది రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, వేలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఒక్క రూపాయి పరిహారం కూడా అందించలేదని అన్నారు. రైతులు ఆర్థికంగా కుంగిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ఎన్నో పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కేవలం ఒక రూపాయి ప్రీమియంతోనే పంటల బీమా కల్పించి, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని చెప్పారు.ప్రస్తుతం రైతులు వేల రూపాయలు బీమా ప్రీమియం చెల్లిస్తున్నప్పటికీ, పంట నష్టం జరిగినప్పుడు పరిహారం అందడం లేదని విమర్శించారు. రైతుల నుంచి డబ్బులు వసూలు చేయడమే తప్ప, అవసరమైన సమయంలో వారికి అండగా నిలిచే పరిస్థితి లేదన్నారు.ఇన్సూరెన్స్ పేరుతో రైతుల నుంచి వసూలు చేస్తున్న నిధులు రైతులకే ఉపయోగపడకుండా ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రైతులకు నిజంగా మేలు చేయాలనే ఉద్దేశం ఉంటే, పంట నష్టం జరిగిన వెంటనే పరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.టీడీపీ నాయకులే రైతులకు పంట బీమా కట్టించుకోవాలని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రైతులు బీమా ప్రీమియం చెల్లించిన తర్వాత కూడా నష్టం జరిగితే పరిహారం అందకపోతే అలాంటి బీమా వల్ల రైతులకు ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు.ఆలూరు నియోజకవర్గంలో అధిక శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని, ఈ ఏడాది సరైన వర్షాలు లేకపోవడంతో అనేక కుటుంబాలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం అర్థం చేసుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని, రైతుల హక్కుల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పోరాటం కొనసాగిస్తుందని ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి స్పష్టం చేశారు.ఈ విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


