న్యూఢిల్లీలో జర్నలిస్టులపై పోలీసుల వైఖరికి నిరసనగా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు
1 min read
ప్రతి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలి
నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయండి: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కమిటీ పిలుపు
పల్లెవాణి, కర్నూలు: న్యూఢిల్లీలో విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసుల దాడుల యత్నాలు, నిర్బంధ చర్యలను నిరసిస్తూ రేపు (అక్టోబర్ 14) జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( ఏపీడబ్ల్యూజేఎఫ్ ) ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఏపీ బిజెఏ ) రాష్ట్ర కమిటీలు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఓటర్ల జాబితాలోని అక్రమాలను ప్రశ్నిస్తూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమాలను కవర్ చేసేందుకు వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు ఆంక్షలు విధించి, నిర్బంధించే ప్రయత్నాలు చేయడాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విధి నిర్వహణలో ఉన్న పాత్రికేయుల పట్ల పోలీసుల వైఖరి ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నాయి.ఈ నేపథ్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లాలోని ప్రతి నియోజకవర్గ పరిధిలో ఉన్న అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ నాయకత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, అన్ని మండలాల్లో నిరసనలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, విధి నిర్వహణలో వారికి భద్రత కల్పించడం కోసం జర్నలిస్టులంతా ఐక్యంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎం. శివశంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి టి.జి. ప్రసాద్, జిల్లా జాయింట్ సెక్రెటరీ పి. జయరాజు పిలుపునిచ్చారు.


