NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బోధనేతర సిబ్బంది వృత్తి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాల్సిందిగా పిలుపు

1 min read

కర్నూలు, న్యూస్ ​నేడు:  శిక్షణ ద్వారా పొందిన జ్ఞానాన్ని విధుల్లో అన్వయిస్తూ వర్సిటీ పరిపాలనలో మెరుగైన సేవలు అందించాల్సిందిగా రాయలసీమ మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయాల వి.సి. ఆచార్య వి. వెంకట బసవరావు పిలుపునిచ్చారు. రాయలసీమ మరియు క్లస్టర్ విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో ఆర్.యు. సెనేట్ హాలులో గత మూడురోజులుగా కొనసాగుతున్న బోధనేతర సిబ్బంది శిక్షణా కార్యక్రమ ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ శిక్షణా కార్యక్రమంలో భాగస్వాములైన నిపుణులు అందించిన సూచనలు సలహాలను పాటిస్తూ బోధనేతర సిబ్బందివృత్తి నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. పరిపాలనా సామర్థ్యం, కార్యదక్షతను పెంపొందించుకున్నపుడే అనుకున్న లక్షాలను అందుకోగలుగుతామని ఆయన వివరించారు. వర్సిటీలోని వివిధ విభాగాల పనితీరు తెలుసుకోవడానికి, విద్యార్థులకు సంబంధించిన విషయాలనుగానీ, ఆచార్యులు, అధ్యాపకులకు సంబంధించిన విషయాలనైనా, ఆర్థికాంశాలనైనా సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ రకమైన శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుందన్నారు. నేడు ఉదయం కొనసాగిన శిక్షణా కార్యక్రమంలో న్యాయపరమైన విషయాలు, కోర్టు కేసుల గురించి తిరుపతి శ్రీ పద్మావతి మహిళావిశ్వవిద్యాలయ న్యాయశాస్త్ర విభాగ ఆచార్యులు ప్రొఫెసర్ టి.సీతా కుమారి అవగాహన కల్పించారు. విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివిధ చట్టాలగురించి విశదీకరించారు. స్టాండింగ్ కౌన్సిల్, లీగల్ సర్వీసెస్, అఫిడవిట్, కౌంటర్ అఫిడవిట్, రిట్ వెకేషన్ మొదలైన న్యాయ విషయాలను గురించి వివరించారు. అనంతరం కొనసాగిన కార్యక్రమంలో రాయలసీమ యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సమాచార హక్కు చట్టం గురించి సవివరంగా తెలియజేశారు. సమాచారహక్కు చట్టం స్ఫూర్తికి భంగంకలగకుండా దరఖాస్తుదారులకు సమాచారాన్ని ఏవిధంగా అందించాలన్న విషయం గురించి సోదాహరణంగా వివరించారు. మధ్యాహ్నం జరిగిన చివరి శిక్షణా కార్యక్రమంలో ఉద్యోగులు తమ వ్యక్తిత్వాన్ని ఏవిధంగా తీర్చిదిద్దుకోవాలో యోగివేమన విశ్వవిద్యాలయ వి.సి. ఆచార్య బి. రాజశేఖర్ వివరించారు. వ్యక్తిగత జీవితాన్ని-వృత్తిజీవితాన్ని ఏ విధంగా సమన్వయించుకోవాలో సోదాహరణంగా వివరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *