ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఎన్నికలా? టీడీపీపై విరుపాక్షి నిప్పులు
1 min read
వైసీపీ అభ్యర్థులపై దౌర్జన్యాలు సహించం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
ప్రజలారా ఆలోచించండి.. నేడు మీ ఓటు, రేపు మీ ఆస్తులు: ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి
ఆలూరున్యూస్ నేడు: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై తెలుగుదేశం పార్టీ శ్రేణులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులను బెదిరించడం, నామినేషన్ పత్రాలను లాక్కొని చించివేయడం వంటి చర్యలతో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.ప్రజలకు మంచి చేశామని చెప్పుకునే ధైర్యం, నమ్మకం ఉంటే ప్రతిపక్షాలను హుందాగా ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లాలని విరుపాక్షి సూచించారు. గెలుపుపై నమ్మకం లేకనే ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో పోటీని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎదుర్కోవాలి తప్ప, బెదిరింపులు, దౌర్జన్యాలతో ఎన్నికలను ప్రభావితం చేయాలని చూడటం సరైన విధానం కాదన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసేందుకు రిటర్నింగ్ అధికారుల వద్దకు వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకుంటూ, వారి పత్రాలను లాక్కొని చించివేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడమేనని విమర్శించారు.
ప్రజల హక్కులను కాపాడుకోవాలి
ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి.. ఈరోజు మీ ఓటు హక్కును అడ్డుకుంటే, రేపు మీ ఆస్తుల విషయంలోనూ ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని విరుపాక్షి వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందన్నారు. రాజకీయ కక్షలు, బెదిరింపులు పక్కనపెట్టి ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు చైతన్యంతో ముందుకు రావాలని, అన్యాయమైన చర్యలను ప్రశ్నించాలని ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పిలుపునిచ్చారు.


