రైల్వే లైన్ వల్ల స్థలం కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా చూస్తా: మంత్రి టీజీ భరత్
1 min read
ఇందిరాగాంధీ నగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి
కర్నూలు , న్యూస్ నేడు: కర్నూలు నగరంలోని 59వ వార్డు ఇందిరాగాంధీ నగర్లో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కర్నూలులో కొత్త రైల్వే లైన్ నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోతున్నామని స్థానికులు మంత్రికి తెలిపారు. తమకు తగిన పరిహారం అందేలా అండగా నిలవాలని కోరారు. దీనిపై మంత్రి టీజీ భరత్ స్పందిస్తూ.. రైల్వే లైన్ కోసం స్థలాలు కోల్పోతున్న వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దేశంలో ఇతర ప్రాంతాల్లో రైల్వే లైన్ల నిర్మాణం సందర్భంగా ఎక్కడ మెరుగైన పరిహారం అందిస్తున్నారో, అదే విధంగా కర్నూలులోనూ బాధితులకు తగిన పరిహారం అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం సంబంధిత కేంద్ర మంత్రితో కూడా చర్చిస్తానని వెల్లడించారు. కర్నూలు నగరంలో అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. గత వైసీపీ పాలనకు, ప్రస్తుత కూటమి పాలనకు ఎంతో తేడా ఉందని, అభివృద్ధి విషయంలో తాము వంద శాతం మెరుగైన పనితీరు కనబరుస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నగర అభివృద్ధి కొనసాగాలంటే కూటమి మేయర్ అభ్యర్థి బొల్లెద్దుల విజయ ప్రత్యూష ను, కార్పొరేటర్ అభ్యర్థి వరలక్ష్మి ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.


