ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో సేవలు అందించాలి
1 min read
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులకు ఆదేశం
(పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్) పై అధికారులతో కలెక్టర్ సమీక్ష
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు సంతృప్తికరమైన రీతిలో సేవలు అందించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో బుధవారం ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి (పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్) పై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని,వాటిని ప్రజల వద్దకు సంతృప్తికరమైన స్థాయిలో తీసుకువెళ్లాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ సేవలలో జవాబుదారీతనం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ సేవలు పొందిన ప్రజల నుండి ఐవిఆర్ఎస్ విధానం ద్వారా వారి అభిప్రాయాలను సేకరిస్తున్నదన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజలు ప్రభుత్వ సిబ్బంది సేవల పట్ల సంతృప్తి చెందితే సానుకూల అభిప్రాయాలను తెలియజేస్తున్నారని, సంతృప్తి చెందకపోతే వ్యతిరేక అభిప్రాయాలను తెలియజేస్తున్నారన్నారు. ప్రభుత్వ సేవలపట్ల ప్రజల సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వం అధికారుల పనితనానికి కొలమానంగా తీసుకుంటున్నదన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతీ ఉద్యోగిపై ఉందని, ప్రజలతో మర్యాదగా మాట్లాడడం, మర్యాదగా ప్రవర్తించడం, నిర్దేశించిన సమయంలోగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేసి, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి (పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్) పై జిల్లాను రాష్ట్రంలో ముందుస్థానంలో నిలిపేందుకు అధికారులు, సిబ్బంది పనిచేయాలన్నారు. విద్యుత్, పౌర సరఫరాలు, పంచాయతీ రాజ్ , పట్టణ ప్రాంతాలలో పారిశుద్యం, రోడ్లు,, రవాణా, మెప్మా, ప్రభుత్వ ఆసుపత్రులు, పిజిఆర్ఎస్ అర్జీల పరిష్కారం, ఆర్టీసీ, తదితర ప్రభుత్వ శాఖల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలలో ప్రజల సంతృప్తి స్థాయి తక్కువగా ఉందని, ప్రజల అభిప్రాయాలలో తక్కువ సంతృప్తి స్థాయిలలో ఉన్న శాఖల అధికారులు, తమ శాఖల సేవలలో లోపాలను తెలుసుకుని, తమ పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. అధికారులు తమ సిబ్బందికి పబ్లిక్ పాజిటివ్ పెర్సెప్షన్ పై అవగాహన కలిగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిపిఓ మల్లికార్జునరావు, డిఎంహెచ్ఓ డా.శోభ,డీఈఓ వెంకటలక్ష్మమ్మ, ట్రాన్స్కో ఎస్ఈ అంబేద్కర్, డిసిహెచ్ఎస్ డా:బేబీ కమల, ఆర్టీసీ ఆర్ఎం షబ్నమ్,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.



