గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
1 min read
నవంబర్ 15 నుండి 17 వరకు నామినేషన్ ల స్వీకరణ, నవంబర్ 26 న పోలింగ్
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి
కర్నూలు, న్యూస్ నేడు : గ్రామ పంచాయతీ మొదటి దశ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిందని, నవంబర్ 15 నుండి 17 వరకు నామినేషన్ ల స్వీకరణ, నవంబర్ 26 న పోలింగ్ జరుగుతుందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా.ఏ.సిరి పేర్కొన్నారు. గ్రామ పంచాయతీఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశం పై మండల స్పెషల్ అధికారులతో, ఆర్ఓ లతో, నోడల్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పూర్తిస్థాయిలో అవగాహన చేసుకుని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా విధులు నిర్వర్తించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో ఒకే రోజు ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్నందున రద్దీ నియంత్రణకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద షామియానాలు, కుర్చీలు, తాగునీటి సౌకర్యం కల్పించాలని, అభ్యర్థులను ఒక్కొక్కరిగా టోకెన్ విధానంలో లోపలికి అనుమతించాలని కలెక్టర్ తెలిపారు. నామినేషన్ పత్రాలను సమర్పించే అభ్యర్థులకు సహాయపడేందుకు కేంద్రాల బయట ఐదు నుంచి ఆరు హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపేలా అవసరమైన మార్గదర్శకాలు అందించాలని, సంతకాలు, ఇతర వివరాలు ఏవైనా అసంపూర్తిగా ఉంటే వెంటనే తెలియజేయాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు అవసరమైన సంఖ్యలో కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు, అనంతరం బ్యాలెట్ పేపర్ల లెక్కింపు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్లకు చెల్లుబాటు అయ్యే ఓట్లు, చెల్లని ఓట్లపై స్పష్టమైన అవగాహన కల్పించాలని, ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద వాలిడ్, ఇన్వాలిడ్ ఓట్లకు సంబంధించిన నిబంధనల ప్రతులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మొదటి రౌండ్లోనే నిబంధనలను వివరించి, కౌంటింగ్ ఏజెంట్లకు పూర్తి విశ్వాసం కల్పించేలా పారదర్శకంగా లెక్కింపు చేపట్టాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ప్రతి అధికారి తనకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు .డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించాలని, ఆహార సరఫరా విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని కలెక్టర్ పేర్కొన్నారు. ఫేజ్-1 ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, అప్పీళ్లు, విత్‌డ్రాలు, పోలింగ్ తేదీలపై అధికారులకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ఏర్పాటు చేయాలని, కలెక్టర్ కార్యాలయం, రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి నిరంతర నిఘా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. టెలి కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, పత్తికొండ ఆర్డీఓ ఓబులేసు, ఆదోని ఆర్డీఓ అరుణ దేవి, డిపిఓ భాస్కర్, ఎంపిడిఓ లు తదితరులు పాల్గొన్నారు.


