సమగ్ర శిక్షా కార్యాలయ భవనాన్ని ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించాలి
1 min read
పాత హాల్, గదులను సద్వినియోగంలోకి తీసుకువచ్చేలా ఆధునికీకరణ పనులు చేపట్టాలి
భవన పునరుద్ధరణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి
నంద్యాల, న్యూస్ నేడు: నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ సమీపంలో ఉన్న డిప్యూటీ ఈఓ కార్యాలయం, సమగ్ర శిక్షా సమావేశ మందిరం ఉన్న భవనాన్ని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శుక్రవారం పరిశీలించారు. భవనాన్ని పూర్తిస్థాయిలో ఆధునీకరించి, సమగ్ర శిక్షా కార్యాలయాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా కలెక్టర్ డిప్యూటీ డిఈఓ కార్యాలయ గదిని, అక్కడ ఏర్పాటు చేసిన కప్ బోర్డులను పరిశీలించి వాటి నిర్వహణ, ఆకర్షణీయమైన ఏర్పాట్లను అభినందించారు. అదేవిధంగా ప్రస్తుతం వినియోగంలో లేని పాత సమావేశ మందిరంతో పాటు మరో రెండు గదులను కూడా పునరుద్ధరించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. భవనంపై ఉన్న పాత రూఫ్‌ను తొలగించి నూతన రేకులు ఏర్పాటు చేయడంతో పాటు, పైకప్పుకు ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసేలా చేపడుతున్న పనులను కలెక్టర్ పరిశీలించారు. పునరుద్ధరణ పనులు నాణ్యతా ప్రమాణాలతో, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు, సిబ్బందికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ భవనాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో తీర్చిదిద్దాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ, సంబంధిత సిబ్బంది కలెక్టర్ వెంట పాల్గొన్నారు.


