ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాలు పెంపు..
1 min read
ఏలూరు, న్యూస్ నేడు : ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీలకు అందించే ప్రోత్సాహక మొత్తాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులున్న గ్రామ పంచాయతీలకు 5 వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 15 లక్షల రూపాయలు, 5,001 నుంచి 10 వేల జనాభా ఉన్న పంచాయతీలకు .25 లక్షల రూపాయలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు 50 లక్షల రూపాయలు ప్రోత్సాహకంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసిందన్నారు. 2026 గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు మాత్రమే ఈ ప్రోత్సాహకాలు పెంపు వర్తిస్తుందన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించిన అనంతరం ప్రోత్సాహకాలను అందించడం జరుగుతుందన్నారు. గతంలో 2 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైతే 5 లక్షల రూపాయలు, 2001 నుండి 5000 జనాభా గ్రామ పంచాయతీలకు 10 లక్షల రూపాయలు, 5001 నుండి 10 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు 15 లక్షల రూపాయలు, 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలకు 20 లక్షల రూపాయలు ప్రోత్సాహకాలుగా అందించే వారని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జనాభా ననుసరించి 15 లక్షల రూపాయల నుండి 50 లక్షల రూపాయల వరకు పెంచిందన్నారు. ఎన్నికల అధికారులు సర్పంచ్ మరియు అన్ని వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలను ఏకగ్రీవంగా అధికారికంగా ప్రకటించిన గ్రామ పంచాయతీలకు మాత్రమే ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందన్నారు. ప్రోత్సాహక మొత్తాన్ని విడుదల చేయడానికి ముందు, గ్రామ పంచాయతీల అర్హతను అధికారులు ధృవీకరించాలన్నారు. ప్రోత్సాహక మొత్తాన్ని, నిర్దేశించిన ఆర్థిక, అకౌంటింగ్ మరియు ఆడిట్ విధానాలకు లోబడి, సంబంధిత గ్రామ పంచాయతీల యొక్క ఆమోదించబడిన అభివృద్ధి కార్యకలాపాలు మరియు ప్రజా సంక్షేమ పనుల కోసం మాత్రమే వినియోగించాలన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ పదవీకాలంలో, పెంచిన ప్రోత్సాహకాన్ని దశలవారీగా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించబడిన గ్రామ పంచాయతీల సంఖ్య ఆధారంగా, అర్హతగల గ్రామ పంచాయతీల జనాభా వర్గాల వారీ వివరాలను గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ సమర్పించాలన్నారు.


