అట్టహాసంగా రవీంద్ర విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: స్థానిక అబ్బాస్ నగర్ లోని రవీంద్ర విద్యాసంస్థల్లో బాలల దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరితంగా, ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రవీంద్ర విద్యాసంస్థల వ్యవస్థాపకులు శ్రీ జి. పుల్లయ్య గారు ముఖ్య అతిథిగా విచ్చేయగా, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ గారు, వైస్ చైర్మన్ శ్రీ జి. వంశీధర్ గారు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి శ్రీ జి. పుల్లయ్య గారు మాట్లాడుతూ, బాలలే దేశ భవిష్యత్తుకు పునాదులని, ప్రతి విద్యార్థిలోనూ అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై ఉందని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రమశిక్షణ, సంస్కారం, మానవీయ విలువలు, ఆత్మవిశ్వాసం కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మమతా మోహన్ గారు మాట్లాడుతూ, విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి, వారి ఆలోచనలకు రెక్కలు తొడగడమే నిజమైన విద్యా లక్ష్యమని తెలిపారు. ప్రతి చిన్నారికి తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు కల్పించాలని, వారి కలలను సాకారం చేసుకునే దిశగా ఉపాధ్యాయులు మార్గదర్శకంగా నిలవాలన్నారు.వైస్ చైర్మన్ శ్రీ జి. వంశీధర్ మాట్లాడుతూ, బాలల సమగ్ర వికాసానికి విద్యతోపాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. విద్యార్థుల ఆనందమే సమాజ విజయానికి అసలైన కొలమానమని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు, వివిధ కళారూపాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.


