నేటి నుంచే సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ.. ఏర్పాట్లు పూర్తి
1 min read
హోళగుంద మండలంలోని ఆరు గ్రామ పంచాయతీల్లో నామినేషన్ కేంద్రాల ఏర్పాటు
ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు – ఎంపీడీవో సయ్యద్ ఉమర్
హోళగుంద న్యూస్ నేడు: గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండటంతో హోళగుంద మండలంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు మండలంలోని ఆరు గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సయ్యద్ ఉమర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు గ్రామాల వారీగా నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
నామినేషన్ కేంద్రాలు – రిటర్నింగ్ అధికారులు:
1. హోళగుంద: ఎంపీడీవో కార్యాలయం – తలారి విశ్వనాథ్.
2. గజ్జెహళ్లి: గ్రామ పంచాయతీ కార్యాలయం – మురవాని వరహలమ్మ.
3. ఇంగలదహాల్: గ్రామ పంచాయతీ కార్యాలయం – కుంబుం సుజాత.
4. హెబ్బటం: గ్రామ పంచాయతీ కార్యాలయం – ఆలూరు ఎ. కారి బసప్ప.
5. సమ్మతగిరి: గ్రామ పంచాయతీ కార్యాలయం – మొహమ్మద్ రిజావుద్దీన్.
6. ఎల్లార్తి: గ్రామ పంచాయతీ కార్యాలయం – చీర్ల దేవేంద్రప్ప.
ఈ కేంద్రాల్లో సంబంధిత రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత సమయంలో నామినేషన్లు సమర్పించాలని అధికారులు సూచించారు.మండలంలోని గ్రామాల్లో ఇప్పటికే ఎన్నికల వాతావరణం నెలకొంది. సర్పంచ్ పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తమ రాజకీయ సమీకరణాలు, మద్దతుదారులతో చర్చలు జరుపుతున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండటంతో గ్రామాల్లో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.ఎన్నికల ప్రక్రియను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సిబ్బందితో సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంపీడీవో సయ్యద్ ఉమర్ వెల్లడించారు.


