బీసీలకు శ్రీవారి ఉచిత దర్శన నజరానా! ఉత్సవాల్లో అవకాశం
1 min readపల్లెవెలుగువెబ్, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో 7నుంచి 15వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో తితిదే బీసీవర్గాలకు శ్రీవారి ఉచిత దర్శన నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో తితిదే మొదటి విడతగా నిర్మంచిన 502 ఆలయాల పరిధుల్లోని బీసీ వర్గాలకు ఉత్సవ రోజుల్లో శ్రీవారి ఉచిత దర్శన సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 13జిల్లాల నుంచి రోజుకు వెయ్యిమందికి చొప్పున వెనకబడిన తరగతుల భక్తులకు శ్రీవారి ఉచిత దర్శనంతోపాటు ఉచిత రవాణా, భోజనం, వసతి సదుపాయాలు సైతం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందుకు ప్రతి జిల్లాకు 10బస్సులు చొప్పున ఏర్పాటు చేసి వెనకబడిన వర్గాల భక్తులను ఉచితంగా తిరుమలకు తరలించి శ్రీవారి దర్శన భాగ్యం కలిగించేందుకు తితిదే చర్యలు చేపడుతోంది. అయితే ఏజెన్సీ జిల్లాలైన తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు 20బస్సులు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.