నిరూపిస్తే 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేస్తాం: రాచమల్లు
1 min read
పల్లెవెలుగువెబ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉన్నట్లు టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్పందించారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి ఎటువంటి సంబంధం లేదన్నారు. ఒకవేళ ఉందని సీబీఐ నిరూపిస్తే కడప జిల్లా 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటామని సవాల్ విసిరారు. ప్రొద్దుటూరులోని తన నివాసంలో ఎమ్మెల్యే రాచమల్లు మీడియాతో మాట్లాడారు. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి ఏమాత్రం పొంతన లేదన్నారు. సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా గతంలో ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవన్నారు. కానీ ప్రొద్దుటూరు కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వివేకా హత్యలో పాల్గొన్నట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని రాచమల్లు ప్రశ్నించారు. అతడిని అప్రూవర్‌గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని ఆరోపించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదని రాచమల్లు అభిప్రాయపడ్డారు.