అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలి: జేఏసీ
1 min readపల్లెవెలుగు వెబ్, పత్తికొండ: ప్రభుత్వం అస్తవ్యస్తంగా ప్రకటించిన 11వ పి ఆర్ సి ని ఎంత మాత్రం అంగీకరించేది లేదని, తక్షణమే అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని జేఏసీ నాయకులు రంగారెడ్డి , కొత్తపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన టి ఆర్ సి కి వ్యతిరేకంగా మంగళవారం ఏపిటిఎఫ్, ఎస్ టి యు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నాలుగు స్తంభాల కూడలి వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఎలాంటి కొలమానాలు లేకుండా ఏకపక్షంగా పి ఆర్ సి ని ప్రకటించడం శోచనీయమని అన్నారు. 27శాతం ఐ ఆర్ ఇచ్చి, 23 శాతం ఫిట్మెంట్ ను ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన పి ఆర్ సి ప్రకారం ప్రస్తుతం ఉన్న జీతాలకే కోత పడుతుందన్నారు. ఆసీస్ మిశ్రా కమిటీ సిఫార్సులను పక్కనబెట్టి అనాలోచితంగా ప్రకటించిన పీఆర్సీని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. జేఏసీ నాయకులను నమ్మించి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన పి ఆర్ సి ని ప్రకటించాలని వారు కోరారు. లేనియెడల ఉద్యమాలను తిరిగి చేపడతామని హెచ్చరించారు. నాలుగు స్తంభాల కూడలి వద్ద ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గంట పాటు ఆందోళన చేశారు. అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయం ఎదుట కొత్త పీఆర్సీని ప్రకటించాలని నినాదాలు చేస్తూ బైఠాయించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్చార్జి తాసిల్దార్ విష్ణు కుమార్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుంపటి సత్యనారాయణ నాగేటి ప్రసాద్ చంద్రశేఖర్ రంగ స్వామి నాయక్ చందు నాయక్ జయరాముడు బలరాముడు పేర్లప్ప తదితరులు పాల్గొన్నారు.