టెన్త్ ఫెయిల్ అయిన వారికి శుభవార్త !
1 min readపల్లెవెలుగువెబ్ : రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంసిద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. రోజూ రెండు సబ్జెక్టులపై విద్యార్థులకు బోధన సాగేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. “ జూలైలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఈ పరీక్షల్లో రాణించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరముంది. ఇందుకోసం సబ్జెక్టు, టాపిక్స్ వారీగా స్పెసిఫిక్ కోచింగ్‌ను చేపట్టాలి. ఈనెల 13వ తేదీనుంచి పరీక్షలు పూర్తయ్యేవరకు రోజుకు రెండు సబ్జెక్టుల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలను రూపొందించాలి. విద్యార్థులతో సబ్జెక్టులను పునశ్చరణ చేయించాలి. వారు ఆత్మవిశ్వాసంతో పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించేలా వారిని తీర్చిదిద్దాలి..’అని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ బాబు వివరించారు.