కట్టలు తెగిన ఆగ్రహం.. అధ్యక్షుడి నివాసం స్వాధీనం !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంక ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రాజకీయ సంక్షోభం పరాకాష్ఠకు చేరుకుంది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలంటూ కొన్ని నెలలుగా చేస్తున్న ఆందోళనలు.. తారస్థాయికి చేరాయి. ప్రజలు, ప్రతిపక్షాలు, శ్రీలంక బార్ అసోసియేషన్.. ఇలా ఎంత మంది డిమాండ్ చేసినా.. నిరసన ప్రదర్శనలు కొనసాగిస్తున్నా.. గొటబాయ మాత్రం అధ్యక్ష పీఠాన్ని వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలో ‘దేశమంతా కొలంబోకు’ పేరిట ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. కర్ఫ్యూ ఎత్తేయడంతో శనివారం ఒక్కసారిగా ఆందోళనకారులంతా రోడ్లెక్కారు. రైళ్లు, బస్సులు, ట్రక్కులు, కార్లు.. ఇలా రకరకాల వాహనాల్లో దేశం నలుమూలల నుంచి ప్రజలు కొలంబో చేరుకున్నారు. గొటబాయ ఇంటిని చుట్టుముట్టేందుకు బయల్దేరిన జనసందోహాన్ని భద్రతా బలగాలు అదుపుచేయలేకపోయాయి. ఆందోళనకారులను అడ్డుకునేందుకు బాష్పవాయువు, జలఫిరంగులను ప్రయోగించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టారు. గాల్లోకి కాల్పులు కూడా జరిపారు. అయినా వారిని అడ్డుకోలేకపోయారు. కొలంబోలోని ఫోర్ట్ ప్రాంతంలో ఉన్న అధ్యక్షుడి ప్యాలె్‌సలోకి జనం చొచ్చుకెళ్లారు. విధ్వంసం లేకుండానే గొటబాయ అధికారిక నివాసాన్ని ఆక్రమించారు.