అభివృద్ధి, వసతుల కల్పనకు పెద్దపీట: మేయర్
1 min readస్థాయీ సంఘం సమావేశంలో 16 తీర్మానాలకు ఆమోదం
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తెలిపిన సమస్యలకు నిధులు కేటాయింపు
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: శనివారం నగర అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ బి.వై. రామయ్య అన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో మేయర్ అధ్యక్షతన ఆయన చాంబర్లో స్థాయీ సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 16 తీర్మానాల్లో ట్రేడ్ లైసెన్స్ పన్ను రూ.4 వేలకు తగ్గింపు, కొండారెడ్డి బురుజు వద్ద నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ లో మిగిలిన 18 షాపులకు బహిరంగ వేలంపాట, కిసాన్ ఘాట్ నిర్వహణ మళ్ళీ ఆదే లీజుదారుడికి అప్పగింత వంటివి కీలకంగా ఉన్నాయి. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు రూ.4.69 కోట్లను సాధారణ నిధుల నుంచి నిధులు కేటాయించారు. ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ మరియు స్థానిక కార్పొరేటర్లు తెలిపిన సమస్యలకు కూడా నిధులు భారీగా కేటాయించారు. సమావేశంలో సభ్యులు పల్లవి, సాన శ్రీనువాసులు, రాజేశ్వర్ రెడ్డి మల్లికా బేగం, కార్యదర్శి లావణ్య, అదనపు కమిషనర్ రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వి. రమాదేవి, ఎస.ఈ. శేషసాయి, ఎం.హెచ్.ఓ. విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్.ఓ. జునైద్, ఎం.ఈ. షాకీర్ హుస్సేన్, ఎగ్జామినేషన్ సుబ్రహ్మణ్యం, మేనేజర్ చిన్నరాముడు, మెప్మా సూపరింటెండెంట్ మంజూర్ బాష, అకౌంట్స్ ఆఫీసర్ చుండి ప్రసాద్, సినియర్ అసిస్టెంట్ రాజేశ్వరరావు, ఆర్.ఐ.లు శ్రీకాంత్, రాజు, సుహైల్, సాదిక్ పాల్గొన్నారు. గత అక్టోబర్ 14న బాణసంచా దుకాణాలకు పెంచిన ఏడాది ట్రేడ్ లైసెన్స్ పన్నును పదివేల నుంచి నాలుగు వేలకు తగ్గిస్తూ ఆమోదించారు.కొండారెడ్డి బురుజు నందు నిర్మించిన నూతన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లోని మొత్తం 34 షాపులలో గతంలో కొండారెడ్డి బురుజు అభివృద్ధిలో భాగంగా అన్ని అర్హతలు ఉండి షాపులు కోల్పోయిన 16 మందికి కేటాయించగా, మిగిలిన 18 షాపులకు చ.మీ. రూ.768 ప్రకారం అద్దెతో పాటు గుడ్ విల్, పాట ధరావత్తులతో బహిరంగ వేలంపాట నిర్వహించడానికి ఆమోదించారు. అనంతరం షాపులకు రిజర్వేషన్లు లాటరీ పద్ధతిన ఖరారు చేశారు.చిల్డ్రన్స్ పార్క్ ను మరింత అభివృద్ధి చేయడానికి రూ.49.90 లక్షలను నగర పాలక సంస్థ సాధారణ నిధుల నుంచి కేటాయించేందుకు ఆమోదం తెలిపారు.40వ వార్డు బంజార కాలనీలో రోడ్లు వేయుటకు రూ.48 లక్షలను నగర పాలక సంస్థ సాధారణ నిధుల నుంచి కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. నగర పాలక సంస్థకు సంబంధించిన వార్షిక లెక్కల అడిట్ మరియు అడిట్ ఆక్షేపణలకు తగిన సమాధానాలు తయారు చేయడానికి రిటైర్డ్ జిల్లా అడిట్ అధికారి జె.హనుమాన్ ప్రసాద్ గారిని వచ్చే ఏడాది నవంబర్ 16 వరకు రీ-ఎంప్లాయిమెంట్ విధానంలో వారి సేవలను వినియేగించుకుంటూ వారికి రూ.35,755/- వేతనం చెల్లించేందుకు ఆమోదం తెలిపారు.