వెనుక బడిన ప్రాంతాలకు… CRDA చట్టం గొడ్డలి పెట్టు..!
1 min readరాష్ట్ర సంపద 29 గ్రామాల అమరావతికే అంటే ప్రాంతీయ ఉద్యమాలు పెరుగుతాయి..
శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం 64 గ్రామాలు, 87వేల ఎకరాల భూమి త్యాగం చేసిన రాయలసీమ రైతులది త్యాగం కాదా?
రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్: రాష్ట్ర సమగ్రాభివృద్దిని విస్మరించి, వెనుకబడిన ప్రాంతాలకు CRDA చట్టం గొడ్డలిపెట్టులా మారిందని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. నంద్యాల పట్టణంలోని నూనెపల్లె శివాలయంలో సీనియర్ న్యాయవాది బి. శంకరయ్య అధ్యక్షతన శనివారం రైతుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో అమరావతి రైతుల తరుపున సీనియర్ న్యాయవాదుల వాదనలు రాష్ట్రంలో మరోమారు ప్రాంతీయ ఉద్యమాలకు ఊతం ఇచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన CRDA చట్టంపై సవరణలకు రాష్ట్ర ప్రభుత్వానికే హక్కులేదనే హైకోర్టులో అమరావతి రైతుల వాధన విస్మయానికి గురించేస్తుందని, రాష్ట్ర సంపద తో మా 29 గ్రామాల్లోనే ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి అనడం సరికాదన్నారు. ఈ ఆలోచన ధోరణితోనే రాష్ట్రం ఇప్పటికే రెండు సార్లు విడిపోయిందని బొజ్జా దశరథ రామిరెడ్డి గుర్తు చేశారు. అన్ని పార్టీలు కూడా అభివృద్ధి చెందిన అమరావతి రైతుల గొంతెమ్మ కోర్కెలకు వంతపలకడం వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంద్ర ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం రాయలసీమలోని కర్నూలు జిల్లాలో 32 గ్రామాలు, తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో 32 గ్రామాలు మొత్తం 64 గ్రామాలు పూర్తిగా కనుమరుగై, 87 వేల ఎకరాల భూమి కోల్పోయి ఆ నాటి పరిహారం కోసం నేటికీ కొందరు ఎదురు చూస్తూ చెట్టుకొకరు, పుట్ట కొకరు చెల్లాచెదురై, కుటుంబాలు చిన్నాబిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ ద్వారా అధిక లాభం పొందవచ్చన్న భావనను గత ప్రభుత్వం కలుగ చేస్తే భూములు ఇచ్చిన అమరావతి రైతులది త్యాగమా, దేశానికే వెలుగు ప్రసాధించేందుకు త్యాగం చేసిన రాయలసీమ రైతులది త్యాగమా ఆలోచించండని అయన కోరారు. రాయలసీమ రైతుల త్యాగంతో మూడు పంటలకు, చేపలు, రొయ్యల చెరువులకు సాగునీరు తీసుకుంటు అభివృద్ధి చెందిన అమరావతి ఉద్యమకారులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాశితుల త్యాగాన్ని అవహేళన చేస్తూ ప్రకటనలు చేస్తున్నా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం చేసిన CRDA చట్టం అమరావతి ప్రాంతంలో ఉద్యోగ, నివాస,అభివృద్ధి అనుభవ హక్కులన్ని 29 గ్రామాలకే దారదత్తం చేసిందన్న హైకోర్టులో వాదనలు, మరి ప్రస్తుత ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ అంటూ కేవలం మాటలకే పరిమితమై కర్నూలులో హైకోర్టు ఎర్పాటుకు ప్రతిపాధనలు పంపకపోవడం, కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నం లో ఏర్పాటుకు ప్రతిపాధించడం తదితర అంశాలతో రాయలసీమ ప్రజాప్రతినిధులకు, ఉద్యమకారులకు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని, రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక అమలుకు, రాష్ట్ర విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కుల సాధనకు ఉద్యమిద్దామని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో తోట పార్థసారథి, ఎ. కొండారెడ్డి, బి. సుబ్బారావు,రామస్వామి, విశ్రాంత ఎస్. ఐ మాధవరావు, టీ. సి. వెంకటసుబ్బయ్య, రామూర్తి, నారాయణగౌడు, సుబ్బారెడ్డి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.