వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారాన్ని లెక్కించండి
1 min read– అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను స్వయంగా పరిశీలించి నష్టపరిహారాన్ని లెక్కించండి
– గ్రామస్థాయిలో సచివాలయ వ్యవస్థను పటిష్టం చేయండి
– ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి కోన శశిధర్, జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: అకాల వర్ష ప్రభావిత మండలాల్లో దెబ్బతిన్న పంటల వల్ల నష్టపోయిన ప్రతి రైతును కలిసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్న భరోసా కల్పించాలని ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి, స్పెషల్ అధికారి కోన శశిధర్ వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వైయస్సార్ సెంటనరీ హాలులో వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, స్పందన గ్రీవెన్స్ క్వాలిటీ డిస్పోజల్ పై జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ తో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా ఎస్పీ కే రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి. టి, జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐటి అండ్ సి శాఖ కార్యదర్శి, స్పెషల్ అధికారి కోన శశిధర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రతి రైతు దగ్గరికి స్వయంగా వెళ్లి ధైర్యం చెప్పాలని వ్యవసాయ అధికారులను సూచించారు ఆదేశించారు. జిల్లాలో 3012 హెక్టార్లలో వివిధ రకాల పంటలు, 123 హెక్టార్లలో ఉద్యాన పంటలు అకాల వర్షాల వల్ల దెబ్బతిన్నాయని… మరో రెండు రోజులపాటు వర్షం ఉన్న నేపథ్యంలో దెబ్బతిన్న పంటల ప్రతి రైతు పొలం దగ్గరకు వెళ్లి స్వయంగా పరిశీలించి నష్టపరహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు సమర్పించేందుకు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాలు అత్యంత చురుకుగా పనిచేసి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరఫున భరోసా కల్పించాలని ఆయన సూచించారు. దెబ్బతిన్న పంట ఉత్పత్తులను ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ను సూచించారు. వర్షం పడితే మధ్య దళారులు మార్కెట్ యార్డులలో అతి తక్కువ ధరకు వేలం పాట పాడుకోకుండా తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
జగనన్నకు చెబుదాం అతి ముఖ్యమైన కార్యక్రమమని
ప్రజలను వచ్చే వినతుల్ని సంతృప్తికర స్థాయిలో పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 9వ తేదీ నుండి ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ క్రమంలో భాగంగా స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీదారుని దరఖాస్తు సంతృప్తి చెందే స్థాయిలో పరిష్కరించాలని ఆయన జిల్లా అధికారులను సూచించారు. ఏ ఒక్కటి పెండింగ్లో ఉండకుండా ప్రతి దరఖాస్తుదారున్ని వ్యక్తిగతంగా కలిసి సమస్యను క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుని ఏ విధంగా పరిష్కరించాలో యోచించి తగు రీతిలో గడువులోగా పరిష్కరించాలని సూచించారు. గ్రామస్థాయిలో సచివాలయ కేంద్రాలు అత్యంత చురుకుగా పనిచేసి 90 శాతం ప్రజా సమస్యలు సచివాలయ స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీల స్థాయిలో ఎంత తక్కువ గ్రీవెన్సెస్ వస్తే అంత విజయం సాధించినట్లని… మార్పు అనేది సచివాలయం వ్యవస్థ నుండి ప్రారంభం కావాలని ఇందుకు సంబంధించి సంబంధిత అధికారులు, మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి సచివాలయ వ్యవస్థను పటిష్టం చేయాలని ఆయన కోరారు. గ్రామస్థాయిలో పరిష్కారం కాని క్రిటికల్ సమస్యలు మాత్రమే కలెక్టర్, ఎస్పీ దృష్టికి రావాలన్నారు. జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలు, పశు సంపద, నష్టపోయిన శాఖల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ అధికారికి వివరించారు. నష్టపోయిన ప్రతి అంశాన్ని పరిహారాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో ధాన్యపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. జిల్లాలోని ఏడెనిమిది మండలాలు అకాల వర్షానికి ప్రభావితమయ్యాయన్నారు. శ్రీశైలంలో కొన్ని గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆత్మకూరు, నంద్యాల ఆర్డీవోలు ఎం దాసు, శ్రీనివాసులు తదితర అధికారులు పాల్గొన్నారు.