తెలంగాణ సీఐడీ పోలీసులకు సీపీఆర్ శిక్షణ
1 min readశిక్షణ లో పాల్గొన్న 150 మంది సిబ్బంది, అధికారులు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ప్రజా భద్రతను పెంపొందించడంలో కీలక ముందడుగులో భాగంగా నగరంలోని ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఒకటైన కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో.. తెలంగాణ సీఐడీ పోలీసుల కోసం ప్రత్యేకంగా కార్డియోపల్మోనరీ రీససిటేషన్ (సీపీఆర్ )పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఆకస్మికంగా గుండెపోటు వచ్చినవారికి తిరిగి ప్రాణాలు పోయడానికి ఉపయోగపడే ప్రాణరక్షణ టెక్నిక్ అయిన సీపీఆర్ చేయడంలో కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను వివిధ స్థాయుల్లో ఉండే పోలీసు సిబ్బంది, అధికారులకు అందించి, వారిని అన్ని రకాల పరిస్థితులకు సన్నద్ధం చేయడం ఈ కార్యక్రమ లక్ష్యం.ఈ కార్యక్రమం ఇప్పటికే చాలా అమూల్యమైన శిక్షణగా నిరూపితమైంది. దీనిద్వారా సీపీఆర్ ఎలా చేయాలన్న విషయమై ప్రాక్టికల్ శిక్షణను అందిస్తుంది. ఇందులో కిమ్స్ ఆస్పత్రికి చెందిన క్రిటికల్ కేర్ స్పెషాలిటీ విభాగంలోని డాక్టర్ హర్ష్, డాక్టర్ శేఖర్, డాక్టర్ పవన్ తదితరుల బృందం పాల్గొంది. తెలంగాణ సీఐడీ పోలీసు విభాగంలోని సిబ్బంది, అధికారులందరికీ ముందుగా లెక్చర్లు, వీడియోలు, ప్రజంటేషన్లు చూపించి, అనంతరం ప్రాక్టికల్ సెషన్ల ద్వారా మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది చాలా ఆసక్తిగా, చురుగ్గా పాల్గొన్నారు. సీపీఆర్ ఎలా చేయాలన్న విషయంపై బొమ్మల మీద ప్రాక్టికల్ శిక్షణ పొందారు. ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు వారికి శ్వాస, రక్త ప్రసరణను సాధారణ స్థాయికి పునరుద్ధరించడంలో కార్డియో పల్మోనరీ రీససిటేషన్.. లేదా సీపీఆర్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ టెక్నిక్ ను ఎవరైనా నేర్చుకోవచ్చు, అత్యవసర పరిస్థితుల్లో జీవన్మరణాల మధ్య తేడాను చూపించవచ్చు. అత్యవసర సమయాల్లో పోలీసు అధికారులు ముందుగా అక్కడకు చేరుకుంటారు కాబట్టి.. వారు సీపీఆర్ చేయడంలో సరైన శిక్షణ పొందడం చాలా అవసరం. దీనివల్ల బహిరంగ ప్రదేశాల్లో కార్డియాక్ అరెస్టు లేదా గుండెపోటు వల్ల సంభవించే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఈ సందర్భంగా కిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కార్డియాలజిస్టు, కోర్సు డైరెక్టర్ డాక్టర్ బి. హయగ్రీవరావు మాట్లాడుతూ, సీపీఆర్ మీద అవగాహన, శిక్షణ అవసరం ప్రస్తుత కాలంలో చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో ప్రతియేటా సుమారు 7 లక్షల మంది గుండెపోటు వల్ల మరణిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. అప్పటికే గుండెవ్యాధులు ఉన్నవారికే కాకుండా ఎవరికైనా ఎప్పుడైనా గుండెపోటు రావచ్చు. అది వచ్చినప్పుడు సమయం చాలా కీలకం. మెదడులోని కణాలు 4-6 నిమిషాల నుంచి అంతరించడం మొదలవుతుంది. ఆ తర్వాత ప్రతి నిమిషం ఆలస్యమయ్యే కొద్దీ బతికే అవకాశాలు 10% చొప్పున తగ్గిపోతుంటాయి. ఎవరికైనా గుండెపోటు వచ్చినప్పుడు పక్కన ఉన్నవాళ్లు ఎవరైనా సీపీఆర్ చేయగలిగితే వాళ్లు బతికే అవకాశాలు ఏకంగా 30% పెరుగుతాయి. అంతేకాదు, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్లు (ఏఈడీలు) సీపీఆర్ విజయవంతం అయ్యే అవకాశాలను మరింత పెంచుతాయి, అసాధారణ గుండె లయను అవి సరిచేస్తాయి. కాబట్టి మరిన్ని ప్రాణాలను మనం కాపాడాలంటే మరింత ఎక్కువ సంఖ్యలో ఏఈడీలు ఉండాలి, సీపీఆర్ శిక్షణ మరింత విస్తృతంగా ఇవ్వాలి అని చెప్పారు. కిమ్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.భాస్కరరావు మాట్లాడుతూ, సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడానికి తమ సంస్థ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, సీఐఎస్ఎఫ్ సిబ్బంది, సాధారణ ప్రజానీకానికి తాము ఈ తరహా శిక్షణ ఇచ్చామని ఆయన వివరించారు. తమ వద్ద శిక్షణ పొందినవారిలో కొందరు చుట్టుపక్కల వారి ప్రాణాలు కాపాడిన సందర్భాలను ఆయన వివరించారు. మరింత ఎక్కువ మందికి సీపీఆర్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరాన్ని డాక్టర్ భాస్కరరావు నొక్కిచెప్పారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ భగవత్ ఈ సందర్భంగా తమ సిబ్బందికి, అధికారులు అందరికీ సీపీఆర్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కిమ్స్ ఆస్పత్రికి తమ కృతజ్ఞతలు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో గుండెపోటు వచ్చినవారి ప్రాణాలు కాపాడటంతో పోలీసుల పాత్రను గుర్తించినందుకు ధన్యవాదాలు చెప్పారు. తమ శాఖలో ఇలాంటి ప్రాణరక్షణ టెక్నిక్‌లను అమలు చేయడం వెంటనే మొదలుపెడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 150 మంది వరకు సిబ్బంది, అధికారులు పాల్గొని విజయవంతంగా శిక్షణ పొందారు.కిమ్స్ ఆస్పత్రి క్రిటికల్ కేర్ విభాగాధిపతి, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు తెలిపారు.