తెదేపా శ్రేణులు డైవర్షన్ పాలిటిక్స్ ఉచ్చులో పడొద్దు… టి.జి భరత్
1 min read– ఓట్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి
– ప్రజల్లోకి వెళ్లి పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలి
– రిలే నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడిన టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ ఉచ్చులో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పడొద్దని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. మంగళవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయని చంద్రబాబు నాయుడు అరెస్టయినప్పటి నుండీ తాను చెబుతూనే ఉన్నానన్నారు. అందుకు నిదర్శనంగానే చాలా మంది ఓట్లు తొలగించబడ్డాయన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు, సమస్యలను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు అరెస్టు జరిగిందన్నారు. తమ వెరిఫికేషన్ లో తొలగించాయని తేలిన ఓట్లనన్నింటినీ మళ్లీ నమోదు చేయిస్తున్నట్లు తెలిపారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు ముందుగా ఓట్లను చెక్ చేసుకోవాలని, తమకు చెందిన వారివి కూడా పరిశీలించాలని కోరారు. తమకున్న సమయంలోనే ఓట్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో దీక్షలు, నిరసనల వరకే పరిమితం అవ్వకుండా ప్రజల్లోకెళ్లి అరెస్టు గురించి వివరించడం, రాష్ట్రంలో ఉన్న సమస్యలను తెలపడం, తెదేపా మేనిఫెస్టో గురించి చెప్పి.. బాబు ష్యూరిటీ బాండ్ పేపర్లను అందజేయడం వంటి కార్యక్రమాలన్నీ రోజూ చేయాలని స్పష్టం చేశారు. లేదంటే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉచ్చులో మనమంతా పడిపోయినట్లేనని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు అరెస్టుతో పెద్ద పెద్ద కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడులు పెట్టాలంటే భయపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పోరేటర్ పరమేష్, నేతలు నాగ వీరాంజనేయులు, ఊట్ల రమేష్, ఆనంద్ రాజు, ఇబ్రహీం, సత్రం రామక్రుష్ణుడు, చెన్న, పాల్ రాజ్, ప్రభాకర్, నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.