అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం
1 min read– తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన త్యాగమూర్తి శ్రీ పొట్టిశ్రీరాములు
జిల్లా కలెక్టర్ డా.జి సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన త్యాగమూర్తి శ్రీ పొట్టి శ్రీరాములు అని జిల్లా కలెక్టర్ డా.జి సృజన కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా కలెక్టర్ డా.జి సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న ఉద్దేశ్యంతో శ్రీ పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబరు 1వ తేదిన ఏర్పాటైనప్పటికీ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం వల్ల ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956 నవంబరు 1వ తేదిన ఏర్పాటయిందని, ఈ సందర్భంగా వారిని గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలన్నారు. వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగుదామన్నారు. వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. అలాంటి నాయకులను ఈ తరం ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్బంగా జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలియజేశారు.జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ తెలుగు వారి ప్రయోజనాలను కాపాడాలన్న ఉద్దేశంతో పొట్టి శ్రీరాములు 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన గొప్ప మహనీయులు అని కీర్తించారు.కార్యక్రమంలో ఇంఛార్జి డిఆర్ఓ మల్లికార్జునుడు, జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి, బిసీ సంక్షేమ శాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.