నెలలు నిండని పిల్లలు… జీవితంలో బాగా ఎదగాలి
1 min readఆర్ఆర్ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
వాళ్లంతా పెద్ద నటీనటులు, దర్శకులు కావాలని ఆకాంక్ష
కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో కనులవిందుగా పిల్లల ర్యాంప్ వాక్
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : “నెలలు నిండని పిల్లలు జీవితంలో చాలా ఎత్తు ఎదిగారని నేను విన్నాను. ఇక్కడ ఎన్ఐసీయూలో చికిత్స పొంది డిశ్చార్జి అయిన ఈ పిల్లలంతా కూడా అలాగే ఎదగాలని కోరుకుంటున్నాను. వాళ్లంతా పెద్ద నటీనటులు, దర్శకులు అవ్వాలి, పెద్ద వ్యక్తులు కావాలి” అని ఆస్కార్ బహుమతి సాధించిన ఆర్ఆర్ఆర్ సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆకాంక్షించారు. “మామూలు డాక్టర్లకు నెలకో ఛాలెంజింగ్ కేసు వస్తుందేమో. ఇక్కడ కడల్స్ ఎన్ఐసీయూలో మాత్రం ప్రతి క్షణం ఛాలెంజింగే. నిరుపేద పిల్లల చికిత్స కోసం ఫౌండేషన్ ప్రారంభించిన డాక్టర్ భాస్కరరావుది చాలా పెద్ద మనసు” అని చెప్పారు. నగరంలోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి ఎన్ఐసీయూలో చికిత్స పొంది, డిశ్చార్జి అయిన పలువురు చిన్నారులు ర్యాంప్ వాక్ చేస్తూ అతిథులను అలరించారు. ఈ కార్యక్రమం ఆహూతులు అందరికీ మనోల్లాసం కలిగించింది. నెలలు నిండకముందే పుట్టి, నియోనేటల్ ఐసీయూ (ఎన్ఐసీయూ)లో చికిత్స పొంది, అన్నిరకాల సమస్యలనూ అధిగమించిన చిన్నారులంతా ఈ కార్యక్రమంలో బోలెడంత సందడి చేశారు. నెలలు నిండకముందే పుట్టినా, ఎన్నిరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా, వాళ్లను పూర్తి ఆరోగ్యవంతులుగా చేయొచ్చన్న సందేశం, ఒక ఆశ, ఆకాంక్ష, నమ్మకం.. ఇవన్నీ వాళ్ల తల్లిదండ్రులకు ఈ కార్యక్రమంతో కలిగాయి. ర్యాంప్-వాకింగ్ ఎన్ఐసీయూ గ్రాడ్యుయేట్లు, వాళ్ల తల్లిదండ్రులతో కలిసి, ఎన్ఐసీయూ సంరక్షణతో సమస్యలను ఎలా అధిగమించగలమన్న విజయగాథలను వినిపించారు. నియోనాటాలజీ క్లినికల్ డైరెక్టర్, కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఎన్ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ అపర్ణ సి ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేశారు. “ఇది చాలా ఆనందకరమైన రోజు. దేశవాసులందరికీ ఒక సరికొత్త ఆశతో కూడిన సందేశాన్ని ఇస్తున్నాం. ఎన్ఐసీయూలో చికిత్స పొంది, అన్ని సమస్యలనూ అధిగమించి బయటకొచ్చిన చిన్నారులు, వాళ్ల తల్లిదండ్రులను మేం ఆహ్వానించాం. తద్వారా ఈ చిన్నారి యోధుల విజయగాథలను అందరికీ చెప్పాలనుకున్నాం” అన్నారు. నెలలు నిండని జననాల గురించి డాక్టర్ అపర్ణ వివరిస్తూ, “ప్రతి సంవత్సరం కోటిన్నర మంది పిల్లలు నెలలు నిండకముందే పుడుతున్నారు. వారిలో పది లక్షల మంది వివిధ సమస్యలతో మరణిస్తున్నారు. ఇలాంటి పిల్లల్లో 98% మందికి విజయవంతంగా నియోనేటల్, పీడియాట్రిక్ చికిత్సలతో నయం చేసి వారిని చిరునవ్వుతో ఇంటికి పంపుతున్న చరిత్ర కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఉంది. ఇక్కడ అత్యాధునిక సాంకేతికత, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యులు ఉన్నారు” అని చెప్పారు. కిమ్స్ ఆస్పత్రిలోని ప్రసూతి, నవజాత, శిశు సంరక్షణ విభాగమైన కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ప్రతియేటా 2వేల మందికి పైగా పిల్లలకు చికిత్సలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువమంది తీవ్రస్థాయి ఆరోగ్య సమస్యలు ఉన్నవారే. ఆస్పత్రిలో రోజుకు 24 గంటలూ పనిచేసే ఎంఐసీయూ, ఆస్పత్రిలోనే ఉండే బ్లడ్ బ్యాంక్, ఫీటల్ మెడిసిన్ యూనిట్ లాంటి సమగ్ర సదుపాయాల వల్ల తీవ్రస్థాయి సమస్యలుండే తల్లీ బిడ్డలను కూడా కాపాడటం సాధ్యమవుతోంది. ఈ కార్యక్రమంలోనే కిమ్స్ ఆస్పత్రుల ఛైర్మన్ డాక్టర్ బొల్లినేని భాస్కరరావు, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కలిసి లిటిల్ వన్స్ క్యూర్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. పేద తల్లిదండ్రులకు నెలలు నిండకముందే పిల్లలు పుట్టినప్పుడు వారికి ఏవైనా తీవ్ర సమస్యలు వస్తే.. ఈ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సాయం చేసి వారికి పూర్తిస్థాయి చికిత్సలు అందిస్తామని డాక్టర్ భాస్కరరావు తెలిపారు. ఇంత పవిత్రమైన కార్యానికి తమవంతు సాయం అందిస్తామంటూ పలువురు దాతలు ముందుకొచ్చి, ఏ ఒక్కరూ ఆర్థిక సమస్యల వల్ల పిల్లల చికిత్సకు వెనకాడకుండా చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లల వైద్య నిపుణులు ఒక ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. అందులో ప్రధానంగా నెలలు నిండకముందే పుట్టిన పిల్లలకు ఇవ్వాల్సిన పోషకాహారం, వారి ఎదుగుదల, అభివృద్ధి, వారిలో ఉండే సాధారణ సమస్యల గురించి అవగాహన కల్పించారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించిన ప్రతి మహిళ- ప్రతి శిశువు అన్న ప్రచారంలో వీలైనంత వరకు నెలలు నిండముందు జననాలను తగ్గించడం, అలా పుట్టిన పిల్లల సంరక్షణను మరింతగా పెంచడం అనే లక్ష్యాలకు అనుగుణంగా కిమ్స్ కడల్స్ ఆస్పత్రి తన నిబద్ధతను చాటుతోంది.
కిమ్స్ కడల్స్ ఆస్పత్రి గురించి:
కిమ్స్ ఆస్పత్రులకు చెందిన ప్రసూతి, నవజాత, శిశు సంరక్షణ విభాగమే కిమ్స్ కడల్స్ ఆస్పత్రి. అత్యాధునిక సాంకేతికత, అధునాతన సదుపాయాలకు తోడు సాక్ష్యాల ఆధారిత ప్రోటోకాల్స్ పాటిస్తున్న కిమ్స్ కడల్స్ ఆస్పత్రి చిన్నపిల్లలు, నవజాత శిశువుల చికిత్సలలో ఒక మార్గదర్శిగా రూపుదిద్దుకుంది. ఇక్కడ తల్లులు, వారి పిల్లల సంక్షేమానికి పెద్దపీట వేస్తారు. ప్రస్తుతం కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, విశాఖపట్నం, నాగ్‌పూర్ ప్రాంతాలలో ఐదు శాఖలు పనిచేస్తున్నాయి.