ధరలు పెంచి.. తప్పు చేశారు…
1 min read– ప్రభుత్వాలకు.. ప్రజలే బుద్ది చెబుతారు
– టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : నిత్యావసర సరుకుల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గాజుల ఖాదర్ భాష ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాయచోటి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగిస్తుంటే.. ప్రజలను ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఇలాంటి పాలకపక్షాన్ని వెంటనే గద్దె దింపాలన్నారు. కొవిడ్ వ్యాక్సిన్ రోజుకు 16 లక్షలు వేస్తున్నామని గొప్పలు చెబుతున్నారనీ, 140 రోజులుగా వ్యాక్సిన్ వేస్తున్నా.. 4 శాతం మందికి కూడా పూర్తి చేయలేదని మండిపడ్డారు. యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉప్పు, పప్పు, నూనెల ధరలకు రెక్కలొచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు కరెంటు చార్జీలు, ఆస్తి, నీరు పెంచడమేకాక చెత్త పన్ను వేయడం ఏమిటని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. సమావేశంలో నియోజకవర్గ సమన్వయకర్త నాగేంద్ర, బోనమల టీడీపీ నాయకులు రాజారెడ్డి, గోపాల్, 19 వార్డు అధ్యక్షులు రెడ్డేయ్య, రెడ్డెప్ప, తదితరులు ఉన్నారు.