విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా ఉండాలి….
1 min readవిద్యార్థులు క్రమశిక్షణ గల పౌరులుగా ఎదగాలంటే క్రీడలకు మించిన సాధనం లేదు
ఫిజికల్ ఫిట్నెస్ లో అర్హత సాధించిన సిలంబం(కర్ర సాము )క్రీడ రెఫరీలు, శిక్షకులను అభినందించిన సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: విద్యార్థులు దురాలవాట్లకు దూరంగా క్రమశిక్షణ కలిగిన పౌరులుగా ఎదగాలంటే క్రీడలకు మించిన సాధనం లేదని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూల్ నగరంలోని ఎన్ఆర్ పేటలో ఉన్న శ్రీ లక్ష్మీ హైస్కూల్లో జరిగిన ఫిజికల్ ఫిట్నెస్ లో అర్హత సాధించిన సిలంబం (కర్రసాము) క్రీడ రెఫరీలు కోచ్ ల అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ పాఠశాల స్థాయిలోనే గంజాయి, మాదకద్రవ్యాలు వంటి అలవాట్లకు బానిసలు అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అలవాట్లకు దూరంగా ఉత్తమ పౌరులుగా ఎదగాలంటే తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు .క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ రాణిస్తారని వివరించారు. మన దేశానికి సంబంధించిన ప్రాచీన విద్య అయినా సిలంబం ( కర్ర సాము) క్రీడ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం అభినందనీయమని తెలిపారు. సుప్రసిద్ధ హాలీవుడ్ నటుడు బ్రూస్ లీ కూడా ఈ విద్యలో ఆరితేరిన నటుడని ఆయన చిత్రాలు చూస్తే ఈ క్రీడా గొప్పదనం తెలుస్తుందని వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు స్మార్ట్ ఫోన్ల వినియోగం, ఎడతెరిపి లేకుండా టీవీలు చూడటం వంటి అలవాట్ల వల్ల చిన్న వయసులోనే ఊబకాయం, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారని వివరించారు. అలాగే మారిన జీవనశైలి వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారని చెప్పారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటే విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు . సిలంబం లాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు ఆత్మ రక్షణతో పాటు ఇతరులకు ఉపయోగపడే విధంగా ఎదుగుతారని చెప్పారు. క్రీడల్లో పాల్గొన్న విద్యార్థులలో క్రమశిక్షణ ,అంకితభావం, ఏకాగ్రత, దేహదారుఢ్యం పెరగడం తో పాటు యోగా ప్రాణాయామం వంటి ఆరోగ్యానికి ఉపయోగపడే అలవాట్లు పెంపొందుతాయని చెప్పారు. ఏ దేశ భవిష్యత్తు అయినా యువతపై ఆధారపడి ఉంటుందని అలాంటి యువత చెడు వ్యసనాలకు దూరంగా దేశానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలంటే క్రీడల్లో పాల్గొనడం ముఖ్యమని చెప్పారు. ప్రస్తుతం సిలంబం క్రీడలకు సంబంధించి ఫిజికల్ ఫిట్నెస్ లో అర్హత సాధించిన రెఫరీలు, కోచ్ లు విద్యార్థులకు ఈ క్రీడలో చక్కని శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలని సూచించారు. సిలంబం క్రీడ అభివృద్ధికి తన వంతు సహకారం నిరంతరం అందిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిలంబం కోచ్ రాఘవేంద్ర ,వైస్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, కార్యదర్శి మహావీర్ తో పాటు షేక్ గౌస్ బాషా, సుబ్రహ్మణ్యం ,గీత, పూజ ,రఘువీర్, సత్యనారాయణ ,అబ్దుల్ బహదూర్ ,శరణ్య, చరనీ తదితరులు పాల్గొన్నారు.