ఆడ పిల్లను రక్షించండి – ఆడపిల్లను చదివించండి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు : ఆడ పిల్లను రక్షించండి – ఆడపిల్లను చదివించండి అని జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డా.జి.సృజన పిలుపు ఇచ్చారు. శనివారం జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ బాలికా వారోత్సవాలలో భాగంగా ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లను చదివించండి స్టిక్కర్లను, ప్రతిజ్ఞ కరపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం సంతకాల సేకరణ పోస్టర్ పై సంతకం చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ బాలిక వారోత్సవాలను జనవరి 19వ తేది నుంచి 24 వ తేది వరకు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆడపిల్లల రక్షించుకోవడం, చదివించడం పై దృష్టి పెట్టాలన్నారు. సంబంధిత లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందు కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రామాలలోని తల్లిదండ్రులు ఆడపిల్లలపై వివక్ష చూపకుండా వారికి కూడా మంచి విద్యను అందించి వారి అభ్యున్నతికి తోడ్పడాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా,భ్రూణ హత్యలకు పాల్పడినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సంబంధిత విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజలలో అవగాహన కల్పించి ఆడపిల్లలను రక్షించాలని, ఆడపిల్లలను చదివించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి వెంకటలక్ష్మి, డిసిపిఓ శారద, శ్రీలక్ష్మి, కోఆర్డినేటర్ సుంకన్న, పద్మ తదితరులు పాల్గొన్నారు.