కర్నూలు జిల్లా సమస్యలు పరిష్కరించండి
1 min read– జిల్లా ఇన్చార్జ్ మంత్రిని కోరిన సీపీఎం జిల్లా నాయకులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు జిల్లాలో సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను కోరారు సీపీఎం జిల్లా నాయకులు. సోమవారం కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రిని సీపీఎం జిల్లా కార్యదర్శి ప్రభాకర రెడ్డి, జిల్లా నాయకులు పి. ఎస్. రాధాకృష్ణ, రాజశేఖర్ కలిసి పలు సమస్యలను విన్నవించారు.
కర్నూలు మార్కెట్ యార్డ్ లో పాణ్యం మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయటాన్ని విరమించుకోవాలని, నంద్యాలలో 115 సంవత్సారాల చరిత్ర కలిగిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం భూములలో మెడికల్ కళాశాల నిర్మాణం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, కర్నూలు పడమటి ప్రాంతంలో శాశ్వత కరువు నివారణ చర్యలలో భాగంగా అర్డీఎస్ కుడి కాలువ నిర్మాణం సత్వరమే పూర్తి చేయాలని, వేదవతి రిజర్వాయర్ కెపాసిటీ తగ్గించ కుండా 8 టిఎంసిల సామర్థ్యంతో నిర్మించాలని, రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు రూ 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, ఆస్పరి మండలానికి వేదవతి రిజర్వాయర్ నుండి సాగు, త్రాగు నీరు ఇవ్వాలని, గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం, మేళిగనూరు వరద కాలువ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, పట్టణ ప్రజలకు భారంగా మార నున్న ఆస్తిపన్ను జి ఓ లు 196,197,198 ఉపసంహరించుకోవాలని కోరారు. అనంతరం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు వినతిపత్రం అందజేశారు.