ఎన్నికల సిబ్బంది సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ద తీసుకున్న జిల్లా కలెక్టర్
1 min read
కృతఙ్ఞతలు తెలిపిన ఉద్యోగులు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఎన్నికల విధులంటే కత్తిమీద సాము లాంటిది. ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా బాధ్యతతో నిర్వర్తించవలసి ఉంటుంది. అటువంటి బాధ్యతలను సిబ్బంది నుండి ఆశించేటప్పుడు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగం పై ఉంది. ఈ విషయంలో ఏలూరు జిల్లా యంత్రాంగం తమ బాధ్యతలను నూటికి నూరుపాళ్లు నెరవేర్చిందనే చెప్పాలి. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయింది. పోలింగ్ అనంతరం ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిజిల్లాల పరిధిలోని 6 జిల్లాలైన ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా, కాకినాడ జిల్లాల నుండి బ్యాలెట్ బాక్సులను పోలింగ్ సిబ్బంది ఏలూరు సర్. సి. ఆర్. రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచేందుకు తీసుకువచ్చారు. గత రెండు రోజుల నుండి ఎన్నో వ్యప్రయాసలకోర్చి ఎన్నికల విధులు నిర్వహించి, చివరి అంకమైన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లకు మొదటి బ్యాచ్ తీసుకువచ్చేసరికి గురువారం రాత్రి సమయం అయింది. ఒకవైపు బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ కు తరలింపు వంటి ముఖ్యమైన ఎన్నికల విధులలో తలమునకలై ఉన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మరోవైపు బ్యాలెట్ బాక్సులు తీసుకు వచ్చిన సిబ్బంది, రిసిప్షన్ సెంటర్లో సిబ్బందికి రుచికరమైన ఆహారం అందించే విషయాన్నీ కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన ప్రదేశంలో, మంచి రుచికరంగా తయారయ్యేలా దగ్గరుండి పర్యవేక్షించారు. వండిన ఆహారాన్ని రుచి చూసి రుచికరంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. ఎంతో శ్రమకోర్చి ఎన్నికల విధులలో పాల్గొన్న తమ శ్రమను గుర్తించి, తమపట్ల ప్రత్యేక శ్రద్ధతో మంచి రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చూపిన శ్రద్ధను పోలింగ్ సిబ్బంది కొనియాడారు. కలెక్టర్ తమ సౌకర్యాలకల్పనపై చూపిన శ్రద్ధను తెలుసుకుని, తాము పడిన కష్టాన్ని మరచిపోయామని, తమపట్ల ఇంత శ్రద్ద చూపిన కలెక్టర్ వెట్రిసెల్వి కి ఉద్యోగులు తమ కృతఙ్ఞతలు తెలియజేసారు. జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి, డిఆర్ ఓ వి. విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఏలూరు నగరపాలక సంస్థ కమీషనర్ భానుప్రతాప్ , ఏలూరు తహసిల్దార్ శేషగిరిరావు, ప్రభృతులు పాల్గొన్నారు.
