PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపుకు కార్యోన్ముఖులు కండి..

1 min read

అత్యంత పారదర్శకంగా, జవాబుదారీ తనంతో ఓట్ల లెక్కింపు  పోలింగ్ నిర్వహణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన అధికారులను, సిబ్బందిని ఆత్మీయ సమ్మేళనంలో అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఎన్నికల నిర్వహణలో కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, జవాబుదారితనంతో విజయవంతం చేసేందుకు సంబంధిత అధికారులు కార్యోన్ముఖులు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అన్నారు. శుక్రవారం రాత్రి స్ధానిక కలెక్టర్ బంగ్లాలో ఎన్నికల విధుల్లో భాగస్వాములైన అధికార్ల అత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిర్వహణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. ఓటర్ల జాబితా తయారీనుంచి ఎన్నికలు ముగిసేవరకూ ప్రతి దశలోను ఆయా అధికారులు, సిబ్బంది తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని ఆయన కొనియాడారు. దీని మూలంగా పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 84.81 శాతం పోలింగ్ నమోదు అయిందన్నారు.విధి నిర్వహణలో ఉన్న అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడం వల్లనే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని, క్షేత్రస్ధాయిలో ఆయా టీమ్ లు చక్కగా పనిచేశాయన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీస్ అధికారులు, సిబ్బందికి చక్కటి మార్గనిర్ధేశం చేసిన జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతిని ప్రత్యేకంగా అభినందించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి తమ తరపున ధన్యవాదాలు తెలపాలని ఆయన ఎస్పీని కోరారు. అయితే ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకగా ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పోలింగ్ నిర్వహణలో చూపించిన స్పూర్తితో అత్యంత సమర్ధవంతంగా పూర్తిచేయాలన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియలో ఓటు గోప్యత చాలా ముఖ్యమన్నారు. సిబ్బంది ర్యాండమైజేషన్, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఏర్పాట్లు, సీల్ వేసేటప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలను గుర్తుచేశారు. జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో పోలీస్, జిల్లా పరిపాలనా యంత్రాంగం మంచి సమన్వయంతో పనిచేసినందునే పోలింగ్ ప్రక్రియ సజావుగా, ప్రశాంత వాతావరణంలో ముగిసిందన్నారు. ఇందుకు తమకు ఎంతో సహకరించిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు జిల్లా ఎస్పీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, అధనపు ఎస్పీ స్వరూపరాణి, సెబ్ జాయింట్ డైరెక్టర్ యన్. సూర్యచంద్రరావు, డిఆర్ఓ డి. పుష్పమణి, ఐటిడిఎ పివో యం. సూర్యతేజ, పలువురు రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నోడల్ అధికారులు, పలువురు డిఎస్పీలు,  తదితరులు పాల్గొన్నారు.

About Author