కిడ్నీ సమస్యలకు ‘ కామినేని ‘ లో రోబోటిక్ చికిత్సలు
1 min read
అందుబాటులో నిపుణులైన వైద్యబృందం
రోజుకు రెండు లీటర్ల మూత్రం వచ్చేంతగా నీళ్లు తాగాలి
వేసవిలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువ
యూరాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర సూర్యప్రకాశ్ సూచనలు
హైదరాబాద్, న్యూస్ నేడు: గడిచిన దశాబ్ద కాలంగా వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. అన్ని వయసుల వారికీ కిడ్నీ సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయని కామినేని ఆస్పత్రి యూరాలజీ విభాగం డైరెక్టర్, సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డాక్టర్. వి. సూర్యప్రకాశ్ అన్నారు. కిడ్నీలకు సంబంధించిన సమస్యలన్నింటికీ కామినేని ఆస్పత్రిలో అత్యాధునికమైన రోబోటిక్ శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ కిడ్నీడే సందర్భంగా ఆస్పత్రి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ప్యాకేజిని ఆవిష్కరించి, ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. “అధిక రక్తపోటు, మధుమేహం, నొప్పినివారణ మందులను అతిగా వాడడం, జీవనశైలిలో మార్పులు, జంక్ ఫుడ్, మాంసాహారాలు ఎక్కువగా తీసుకోవడం లాంటి కారణాల వల్ల ప్రధానంగా కిడ్నీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. కామినేని ఆస్పత్రిలోనే రోజుకు సుమారు 40 మంది వరకు కిడ్నీ సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇక్కడ యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కలిపి ఉన్న ఆరుగురు సీనియర్ వైద్య నిపుణులు వీరిని క్షుణ్ణంగా పరిశీలించి తగిన చికిత్సలు అందిస్తున్నాం. ఇటీవలి కాలంలో కిడ్నీల్లో రాళ్లు, పలు రకాల కణితులు, ప్రోస్టేట్ సమస్యలు ఉంటున్నాయి. కిడ్నీలు విఫలమైనవారికి ఇక్కడ అన్నిరకాల డయాలసిస్ సదుపాయాలు ఉన్నాయి. హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్.. ఇలా అన్నీ చేస్తున్నాము. జీవన్మృతుల నుంచి అవయవాలు సేకరించి మార్పిడిచేసే కెడావర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు ఆస్పత్రిలో బాగా జరుగుతున్నాయి. గడిచిన 20 రోజుల్లోనే ఐదుగురికి ఇలా కిడ్నీలు మార్చాము. లైవ్ డోనార్ సర్జరీలు అయితే దాతకు కూడా లాప్రోస్కొపిక్ పద్ధతిలో చేస్తున్నాము. దానివల్ల సమస్య తక్కువగా ఉండి, త్వరగా డిశ్చార్జి అయ్యే అవకాశం ఉంటుంది. సీఎంఆర్ రోబో అనే అత్యాధునిక రోబో సాయంతో రోబోటిక్ శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ చేస్తున్నాము.
వేసవిలో జాగ్రత్తలు తప్పనిసరి
గత కొన్ని సంవత్సరాలుగా వేసవిలో ఉష్ణోగ్రతలు బాగా ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటప్పుడు తగినంత నీరు తీసుకోకపోతే శరీరంలో క్రిస్టల్స్ ఏర్పడి, అవి చివరకు కిడ్నీల్లో రాళ్లుగా మారుతాయి. ఈ సమస్య వేసవిలోనే ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల రోజుకు రెండు లీటర్ల మూత్రవిసర్జన జరిగేలా నీళ్లు తాగాలని రోగులకు సూచిస్తున్నాము. అంటే రోజుకు మూడున్నర నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగాలి. దాంతోపాటు ఆరంజ్, నిమ్మకాయ, దబ్బకాయ లాంటి సిట్రస్ జాతి ఫలాలను వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే కొన్ని లక్షణాలు కిడ్నీల్లోరాళ్లు ఏర్పడకుండా ఆపుతాయి. వేసవిలో శరీరానికి తగినంత హైడ్రేషన్ అవసరం. అలాగే ఉప్పు వాడకం బాగా తగ్గించాలి. సోడియం ఎక్కువైతే అదే రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతుంది. దాంతోపాటు అధిక రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకుంటే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు” అని డాక్టర్ సూర్యప్రకాశ్ వివరించారు. సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, డాక్టర్. వి. విష్ణువర్ధనరెడ్డి మాట్లాడుతూ, “శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వడంతో పాటు.. మంచి ఆహారపు అలవాట్లు చేసుకోవాలి. సమతులాహారం తినాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు రక్తంలో ఆమ్లం మోతాదును తగ్గించి కిడ్నీలను కాపాడతాయి. వీలైనంత వరకూ ఇంట్లో వండిన ఆహారమే తినాలి” అని సూచించారు. సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ డాక్టర్. ఎ. సంతోష్‌కుమార్ మాట్లాడుతూ, “కిడ్నీ వ్యాధుల తొలిదశలో పెద్దగా లక్షణాలేవీ ఉండవు. చివరి దశలో కిడ్నీలు పూర్తిగా విఫలమవుతాయి. జబ్బు ముదురుతున్న కొద్దీ లక్షణాలు బయటపడతాయి. నిస్సత్తువ, మూత్రంలో నురగ, రక్తం పడటం, పాదాలు, కాళ్ల వాపులు, ఆయాసం, రక్తపోటు బాగా పెరగడం వంటివి కనిపిస్తాయి. అందువల్ల ఇలాంటి లక్షణాలేవైనా గమనిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి” అని చెప్పారు.