వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి
1 min read
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ :
ఆదోని, న్యూస్ నేడు: వేసవి కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు అధికారులను ఆదేశించారు. మంగళవారం సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో త్రాగునీటి సరఫరా అంశాలపై ఎంపీడీవోలు, ఆర్డబ్ల్యూఎస్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ….వేసవి కాలంలో త్రాగునీటి అవసరాలు పెరగనున్న దృష్ట్యా తగినన్ని చర్యలు ముందస్తుగా తీసుకోవాలని తెలిపారు. ప్రజలకు తగినంత మోతాదులో త్రాగునీరు అందించేందుకు ప్రతి గ్రామంలో ఉన్న నీటి వనరులను పర్యవేక్షించాలన్నారు. చెరువులు, బోర్లు, ఓపెన్ వెల్స్, వాటర్ ట్యాంక్ లు వంటి నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులలో నీటి సరఫరా కొరత ఏర్పడితే తక్షణమే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, దీనికి అవసరమైన ప్రణాళికను అధికారులు సిద్ధం చేయాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామంలో పంచాయతీ అధికారులను అప్రమత్తంగా ఉంచి త్రాగు నీటి సమస్యలు తలెత్తిన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. త్రాగునీటి సమస్య పై పత్రికల్లో వచ్చిన ప్రకటనలను క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు తనిఖీ చేసి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు.కంట్రోల్ రూమ్ ఏర్పాటు: గ్రామంలో త్రాగునీటి సమస్య ఏదైనా వస్తే డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ గ్రామీణ నీటిపారుదల శాఖ వారి కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగినదని గ్రామంలో త్రాగునీటి సమస్య వస్తే క్రింది నెంబర్లకు 9704643236 , 7892264314 ఫోన్ నెంబర్స్ కాల్ చేసి త్రాగునీటి సమస్యను చెప్పవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పద్మజ, డివిజన్ లోని ఎంపీడీవోలు, గ్రామీణ నీటి సరఫరా అధికారులు, పాల్గొన్నారు.