సింగిల్ విండో పధకం ద్వారా 41 పరిశ్రమలకు అనుమతులు
1 min read
13 పరిశ్రమలకు1.68 కోట్ల ప్రోత్సాహకాలు
జిల్లాలోని వివిధ పరిశ్రమల ఉత్పత్తులకు డిజిటల్ మార్కెటింగ్ సౌకర్యాలు పెరిగేలా చర్యలు
భద్రతా నిబంధనలు పాటించని పరిశ్రమలపై కేసులు నమోదు చేయండి
అధికారులకు కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : జిల్లాలో 41 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ మరియు జిల్లా పారిశ్రామిక భద్రతా కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నదని, ప్రభుత్వ ప్రాధాన్యతను ననుసరించి పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల దరఖాస్తులను పరిశీలించి నిబంధనల మేరకు ఉన్న దరఖాస్తులకు సింగిల్ విండో పధకం ద్వారా నిర్దేశించిన సమయంలోగా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. పరిశ్రమల అభివృద్ధి పాలసీని అనుసరించి 13 పరిశ్రమలకు 1. 68 కోట్ల రూపాయలను ప్రోత్సాహకాలుగా మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలో వివిధ పరిశ్రమల ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా డిజిటల్ మార్కెటింగ్ మరింత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. భద్రతా నిబంధనలు పాటించని పరిశ్రమల యజమానులపై కేసులు నమోదు చేయండి: అధికారులకు కలెక్టర్ ఆదేశం జిల్లాలో భద్రతా నిబంధనలను పాటించని పరిశ్రమలపై కేసులు నమోదు చేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు భద్రత ప్రధానమన్నారు. జిల్లాలో గత రెండు నెలల్లో పరిశ్రమలలో ప్రమాదాల కారణంగా మరణాలు సంభవించడంతోపాటు, కొంతమంది కార్మికులు గాయాలపాలయ్యారన్నారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు భద్రత ప్రధానమని, జిల్లాలో అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. జిల్లాలోని పరిశ్రమాలన్నింటిలోనూ భద్రతా పరమైన అంశాలను పరిశీలించి, నిబంధనలు పాటించని పరిశ్రమల యజమానులకు షోకాజ్ నోటీసులు జారీచేసి, కేసులు నమోదు చేయాలనీ ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా అగ్నిమాపక శాఖాధికారులను కలెక్టర్ ఆదేశించారు. అన్ని పరిశ్రమలలోనూ ప్రమాద సమయంలో అత్యవసర పరిస్థితులలో తీసుకోవలసిన చర్యలు గురించి ‘మాక్ డ్రిల్’ ప్రతీ సంవత్సరం నిర్వహించేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అత్యవసర సమయంలో బయటకు వచ్చే రక్షణ దారులపై కార్మికులకు పరిశ్రమలలో భద్రతా చర్యలను అధికారులతో పాటు ట్రేడ్ యూనియన్ వారు కూడా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డిఆర్డిడిఏ పీడీ ఆర్. విజయరాజు, హార్టికల్చర్ డిడి రామ్మోహన్,ఎల్డిఎమ్ నీలాద్రి, కార్మిక శాఖ ఉప కమీషనర్ పి . శ్రీనివాస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ వెంకటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ అఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాసరావు, , వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.