అభద్రత భావానికి గురి అవుతున్న జర్నలిస్టులు
1 min read
జర్నలిస్టుల సంక్షేమ పథకాలు తక్షణం పునర్ధరించాలి
దివంగత జర్నలిస్టులు “నేతాజీ”శర్మ, విజయ్, బాలు లకు ఘన నివాళి.
విజయవాడ , న్యూస్ నేడు : సమాజ సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్న జర్నలిస్టులు కనీస ఆదాయాలు, కనీస ప్రభుత్వ ప్రోత్సాహం లేక తీవ్ర ఆబద్రత భావానికి గురి అయ్యి, ఆరోగ్యాలను దెబ్బతీసుకుంటున్నారని ఆంధ్ర ప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీ రామ్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సంపాదకుల సంఘం అధ్యక్షులు కే ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఇటీవల అనారోగ్య సమస్యలతో గుండెపోటు గురై మరణించిన నేతాజీ శర్మ, హేలాపు విజయ్, జర్నలిస్ట్ బాలు లకు పలువురు జర్నలిస్ట్ లు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ఎంపనెల్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ఎన్.ప్రసాద్, జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వేణు తదితరులు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభం గా గొప్పగా చెప్పుకుంటున్న పత్రిక వ్యవస్థ, అందులో పని చేస్తున్న పాత్రికేయులు 80 శాతము పైగా తీవ్ర ఇబ్బందుల మధ్య వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు తమ సంక్షేమ పథకాలు ప్రజలకు అందేందుకు, అదే విధంగా ప్రజా సమస్యలు మీడియా వ్యవస్థ ద్వారా తెలుసుకొని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నావే తప్ప ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా ఉంటున్న పాత్రికేయుల సంక్షేమాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయన్నారు.6 కోట్ల ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం జీవోలు విడుదల చేసే ప్రభుత్వాలు, 40 వేల మంది లోపు ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ ఒక్క జి. ఓ.ను ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా, సమయానికి విడుదల చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.2025 అక్రిడేషన్ జీవోను తక్షణమే విడుదల చేయాలని, గత చంద్రబాబు నాయుడు హయాంలో అమలులో ఉన్న అన్ని జర్నలిస్టుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం తక్షణమే పునర్దించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు యేమినేని వెంకటరమణ, నగర అధ్యక్షులు తాళ్లూరి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.